దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక పథకాలుంటాయని, పరిశ్రమల రాయితీలకు కోత పడుతుందని చాలా మంది అంచనా వేశారు. వారి అంచనాలు తప్పాయి.బడ్జెట్లో మూలధన వ్యయానికి భారీ కేటాయింపులు చేయడం పెట్టుబడిదారులను ఆకర్షించింది.
ఉదయం భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు, 2 గంటల సమయానికి జీవితకాల గరిష్ఠాలను (sensex lifetimehigh) తాకాయి. ఒక దశలో సెన్సెక్స్ 1400 పాయింట్లు లాభపడింది.73089 పాయింట్ల జీవితకాల గరిష్టాలను తాకింది. చివరకు 440 పాయింట్ల లాభంతో 72085 వద్ద ముగిసింది. నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 21853 వద్ద క్లోజైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఎన్టీపీసీ, టాటాస్టీల్, టీసీఎస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాలను చవిచూశాయి. రూపాయి బలపడి 82.91వద్ద కొనసాగుతోంది. ముడిచమురు ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. బ్యారెల్ 79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర పరుగులు పెట్టింది. ఔన్సు బంగారం 2070 డాలర్లుకు ఎగబాకింది.