We will release a whitepaper on the economic situation of the country
దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంటులో
శ్వేతపత్రం విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
2014 వరకూ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పటినుంచి ఇప్పటివరకూ ఎలా ఉంది అన్న
విషయాలపై శ్వేతపత్రం ఉంటుందని చెప్పారు. అప్పట్లో ఆర్థిక నిర్వహణలో లోపాల నుంచి
పాఠాలు నేర్చుకోడానికి ఆ శ్వేతపత్రం ఉపయోగపడుతుందని ఆమె వివరించారు.
ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ
సందర్భంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘‘ఆ యేళ్ళనాటి సంక్షోభాన్ని
అధిగమించాం, ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉంది, సుస్థిరమైన అభివృద్ధి
పథంలో సమగ్రాభివృద్ధితో పురోగమిస్తోంది. పరిపాలన, అభివృద్ధి, పనితీరు, ప్రజలకు సమర్ధంగా
చేర్చడం, ప్రజా ప్రయోజనాల విషయంలో అద్భుతమైన పనితీరు వల్ల ప్రజలు మా ప్రభుత్వాన్ని
దృఢంగా విశ్వసిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మా ప్రభుత్వపు సదుద్దేశం,
అంకితభావం, కఠోర పరిశ్రమ కారణంగా రానున్న సంవత్సరాలు, దశాబ్దాల్లో ‘వికసిత భారతం’
అనే లక్ష్యం నెరవేరుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేసారు.
‘‘2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
అప్పుడు మా బాధ్యత దేశ ఆర్ధిక స్థితిని కొంచెంకొంచెండగా లొంగదీయడం. మహా పెద్దవైన
ప్రభుత్వ వ్యవస్థలను గాడిలో పెట్టడం. ఇప్పుడు అత్యవసరమైనది ఏంటంటే ప్రజలకు భరోసా
కల్పించడం, వారికి ఆశ కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, సంస్కరణలకు అవసరమైన
మద్దతు కూడగట్టడం. ‘దేశమే ముందు’ అని భావించే మా ప్రభుత్వం ఆ లక్ష్యాలను విజయవంతంగా
చేరుకోగలిగింది’’ అని నిర్మలా సీతారామన్ వివరించారు.