Special focus on tourism in the islands including Lakshadweep
దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంపై శ్రద్ధ
వహిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు, లక్షద్వీప్ సహా
భారతదేశంలోని దీవుల్లో పర్యాటకానికి అనుకూలంగా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను మరింత
అభివృద్ధి చేస్తామన్నారు.
2024 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన
నిర్మలా సీతారామన్, తన ప్రసంగంలో పర్యాటకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
జి-20 సదస్సులో భాగంగా 60 సమావేశాలను 60 ప్రదేశాల్లో నిర్వహించడం ద్వారా భారతదేశపు
వైవిధ్యం గురించి ప్రపంచదేశాలకు తెలిసేలా చేసామన్నారు.
‘‘జి-20 సదస్సులో భాగంగా 60 సమావేశాలను 60
ప్రదేశాల్లో విజయవంతంగా నిర్వహించడం వల్ల ప్రపంచానికి భారతదేశపు వైవిధ్యం గురించి
బాగా తెలిసింది. మన ఆర్థిక పరిపుష్టి వల్ల మన దేశం వ్యాపార పర్యాటకం, సదస్సుల
నిర్వహణ పర్యాటకం కోణంలో ప్రపంచదేశాలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలిచింది.
మనదేశంలోని మధ్యతరగతి ప్రజలు కూడా ఇఫ్పుడు పర్యటనలు చేయడంపై మక్కువ చూపుతున్నారు. ఆధ్యాత్మిక
పర్యాటకం సహా మొత్తం పర్యాటకం అభివృద్ధి వల్ల వివిధ ప్రాంతాల్లో స్థానిక వ్యాపారాల
విస్తృతికి అవకాశాలు పెరుగుతున్నాయి’’ అని నిర్మలా సీతారామన్ వివరించారు.
‘‘దేశీయ పర్యాటకానికి ఆదరణ
పెంచడం కోసం కృషి చేస్తున్నాము. భారతదేశంలోని దీవుల్లో ఓడరేవుల కనెక్టివిటీ,
పర్యాటక మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను అభివృద్ధి చేస్తాం. లక్షదీవుల్లో కూడా అలాంటి
అభివృద్ధి జరుగుతుంది. దానివల్ల ఉద్యోగావకాశాలు కూడా పుట్టుకొస్తాయి’’ అని మంత్రి
చెప్పారు.
ఇంకా, వివిధ
రాష్ట్రాల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను గుర్తించడం, వాటిని సమగ్రంగా అభివృద్ధి
చేయడం, వాటికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేయడం దిశగా రాష్ట్ర ప్రభుత్వాలను
ప్రోత్సహిస్తామని చెప్పారు. అటువంటి పర్యాటకప్రాంతాల సమగ్ర అభివృద్ధికి
రాష్ట్రాలకు వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు సైతం ఇస్తామని ప్రకటించారు.