విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాకపోవడంపై ఆ శాఖ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. రైల్వే జోన్ డీపీఆర్ సిద్దంగా ఉందని, ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 53 ఎకరాల భూమి కేటాయించలేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి రూ.886 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుత బడ్జెట్లో ఒక్క ఏపీకి రూ.9138 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు.
ఏపీలో ఏటా 240 కి.మీ కొత్త రైలు మార్గాల నిర్మాణం జరుగుతోందని రైల్వే మంత్రి వెల్లడించారు. విద్యుదీకరణ పనులు నూరుశాతం పూర్తయ్యాయన్నారు. పదేళ్లలో 414 ఫ్లైఓబర్లు, అండర్ పాస్లు నిర్మించినట్లు గుర్తుచేశారు. రైల్వేలపై కేంద్రం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. తెలంగాణలోని ఖాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయన్నారు.