రాష్ట్ర
ప్రభుత్వాలు తప్పులు చేసి వాటిని కేంద్రానికి ఆపాదించడం సరికాదని బీజేపీ రాష్ట్ర
అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని ప్యాకేజీ చాలని
అప్పటి సీఎం, కేంద్రాన్ని అడిగిన విషయాన్ని తెలుగుదేశంతో పాటు, వైసీపీ, కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వాన్ని
తప్పుపట్టడం మానుకోవాలన్నారు.
పశ్చిమగోదావరి
జిల్లా భీమవరంలో పర్యటించిన పురందరేశ్వరి,
25 పార్లమెంటు నియోజకవర్గాల బీజేపీ ఎన్నికల కార్యాలయాలను వర్చువల్ గా
ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పేదల
సంక్షేమం కోసం స్కీములు వచ్చాయన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పాలనలో స్కామ్ లు
మాత్రమే ఉండేవని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసకర పాలన కొనసాగుతోందని విమర్శించిన
పురందరేశ్వరి, గుళ్ళు, గుళ్ళలోని విగ్రహాలను కూలగొడుతున్నారని మండిపడ్డారు. తలలేని
మొండెంలా , రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన
పురందరేశ్వరి, అమరావతిని రాజధానిగా భావించి నిధులు మంజూరు చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందనడంలో
ఎలాంటి సందేహం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రతీ రూపాయిని కేంద్రమే
ఖర్చు చేస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.