Bharat-Middle East-Europe Economic Corridor will be a Gamechanger
భారత్ నుంచి మధ్యప్రాచ్యం మీదుగా ఐరోపా
వరకూ ఏర్పాటు చేయనున్న ఆర్థిక కారిడార్ భారతదేశానికి వ్యూహాత్మకంగానూ, ఆర్థికంగానూ
భారతదేశానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కారిడార్ గురించి ప్రస్తావించిన నిర్మలా సీతారామన్, ఆ
కారిడార్ భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యానికి ఆధారం అవుతుందన్న ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ మాటలను పునరుద్ఘాటించారు.
‘‘ఇటీవల ప్రకటించిన
భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్ వ్యూహాత్మకంగా, ఆర్థికంగా భారతదేశానికీ,
ఇతరులకూ కూడా లాభం చేకూరుస్తుంది. ప్రధానమంత్రి మాటల్లో చెప్పాలంటే ఆ కారిడార్
వందల యేళ్ళ పాటు ప్రపంచ వాణిజ్యానికి ఆధారమవుతుంది. ఆ కారిడార్ భారత భూభాగం మీద
పురుడు పోసుకుందన్న సంగతిని చరిత్ర గుర్తుంచుకుంటుంది’’ అని నిర్మల చెప్పారు.
లోక్సభలో తన బడ్జెట్ ప్రసంగంలో ‘‘వికసిత
భారత్ కోసం మన ఆలోచన ఏంటంటే భారతదేశాన్ని సమృద్ధంగా తీర్చిదిద్దడం, ప్రకృతికీ
ఆధునిక మౌలిక సదుపాయాలకూ మధ్య సమన్వయం కుదర్చడం, దేశంలోని అందరు పౌరులకూ అవకాశాలు
కల్పించడం, అన్ని ప్రాంతాలూ తమ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేలా చేయడం. అద్భుతమైన
పనితీరుతో, పురోగమనంతో అందరి విశ్వాసాన్నీ చూరగొన్న విశ్వాసంతో చెబుతున్నాను,
వచ్చే ఐదేళ్ళూ అనూహ్యమైన అభివృద్ధిని నమోదు చేస్తాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన
భారతదేశాన్ని సాధించాలన్న స్వప్నాన్ని సాకారం చేసే బంగారు తరుణమది’’ అని నిర్మల
చెప్పుకొచ్చారు.
జి-20కి భారత్ అధ్యక్షత వహించి విజయవంతం చేసిన
సందర్భాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. ‘‘కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచం కొత్త
గతిని సంతరించుకుంటోంది. ప్రపంచం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్
జి-20కి అధ్యక్షత వహించింది. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, ప్రజారుణాలు విపరీతంగా
పెరిగిపోయి, ఆర్థిక, వాణిజ్య అభివృద్ధి భారీగా పతనమైపోవడంతో ప్రపంచంలోని ఆర్థిక
వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆహారానికి, ఎరువులకు,
ఆర్థికరుణాలకు ప్రపంచమంతటా సంక్షోభం ఏర్పడింది. అలాంటి సమయంలో భారత్ విజయవంతంగా
ముందడుగులు వేయగలిగింది’’ అని నిర్మల వివరించారు.
‘‘ఆ అంతర్జాతీయ సమస్యలకు
పరిష్కారాల విషయంలో ఏకాభిప్రాయం సాధించేలా భారత్ ముందడుగులు వేసింది. ఇటీవల
ప్రకటించిన భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్ వ్యూహాత్మకంగానూ,
ఆర్థికంగానూ మనదేశంతో పాటు ఇతర దేశాలకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది’’ అని ఆర్థిక
మంత్రి వెల్లడించారు.