దేశంలో పేదలు, మధ్యతరగతి వారి ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 2 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని, మరో కోటి ఇళ్లు నిర్మిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పేదలు, మధ్యతరగతి వారి సొంతింటి కల నెరవేర్చేందుకు హౌసింగ్ స్కీం తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పీఎం ఆవాస్ యోజన పథకం కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. త్వరలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యం చేరుకుంటామన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో కోటి ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.
కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం
విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే పథకం ప్రకటించారు. ఇంటిపైకప్పుపై ఏర్పాటు చేసుకునేలా సోలారైజేషన్ స్కీమ్ తెస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల ఏటా పేదలపై రూ.15 వేల కోట్ల భారం తగ్గనుంది. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రధాని మోదీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ ప్రకటించారు.