రైల్వేల ఆధునికీకరణకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఇప్పటికే ప్రయాణీకుల ఆదరణ పొందిన వందేభారత్ రైళ్లలో లభించే సదుపాయాలు సాధారణ బోగీల్లో కల్పించనున్నారు. అందుకు అనుగుణంగా 40 వేల బోగీలను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు.
భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు చోదక శక్తిగా ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశంలో మూడు ప్రధాన రైల్వే కారిడార్లను రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. వీటిల్లో ఇంధన, ఖనిజ, సిమెంట్ కారిడార్, నైకా అనుసంధాన కారిడార్, ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్ ఉన్నాయి. గతి శక్తి పథకం కింద వివిధ మార్గాలను అనుసంధానించనున్నట్లు నిర్మలా ప్రకటించారు.
రైల్వే కారిడార్లు ఏర్పాటు చేయడం ద్వారా మెరుగైన, వేగవంతమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. వందేభారత్ తరహాలో సెమీ హైస్పీడ్ రైళ్లను ఇప్పటికే ప్రవేశపెట్టారు. దశల వారీగా వాటి సంఖ్యను పెంచుతారు. త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. రాజధాని, శతాబ్ధి కంటే మెరుగైన సదుపాయాలు ఇందులో ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు.