The Three Ds will fulfil the aspirations of all Indians
అందరినీ కలుపుకునిపోయే, అందరికీ ఉపయోగకరమైన,
అందరికీ అందుబాటులో ఉండే అభివృద్ధిని సాధించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం
ప్రయత్నిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. డెమోక్రసీ, డెమోగ్రఫీ,
డైవర్సిటీ (ప్రజాస్వామ్యం, జనసంఖ్య, వైవిధ్యం) అనే మూడు సూత్రాలూ… అందరు
భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తాయని ఆమె వ్యాఖ్యానించారు.
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల ముందు తన ఆరవ
బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, భారత ఆర్థిక వ్యవస్థ గత పదేళ్ళలో
గణనీయమైన సానుకూల మార్పును చవిచూసిందన్నారు.
‘‘వచ్చే
ఐదేళ్ళూ ఇంతకు ముందెన్నడూ చూడని అభివృద్ధిని చూస్తాయి. డెమోక్రసీ, డెమోగ్రఫీ, డైవర్సిటీ
అనే మూడు సూత్రాలూ భారతీయులందరి ఆకాంక్షలనూ నెరవేర్చడంలో సాయపడతాయి. భారత ఆర్థిక
వ్యవస్థ గత పదేళ్ళలో గణనీయమైన సానుకూల మార్పును సాధించింది. భారతదేశ ప్రజలు ఎంతో
ఆశతో, సానుకూల దృక్పథంతో భవిష్యత్తును దర్శిస్తున్నారు’’ అని నిర్మల చెప్పారు.
అభివృద్ధి గురించి తమ ప్రభుత్వపు దార్శనికత అన్ని కులాలనూ,
అన్నిస్థాయుల ప్రజలనూ కలుపుకుని పోతుందని నిర్మల చెప్పారు. 2047 నాటికి దేశాన్ని
వికసిత భారతంగా మలచడమే తమ లక్ష్యమన్నారు.
‘‘మన ప్రధానమంత్రి
నరేంద్రమోదీ బలంగా నమ్మే విషయం ఏంటంటే మనం నాలుగు ప్రధాన కులాల మీద దృష్టి సారించాలి. పేదలు, మహిళలు, యువత,
రైతులు… ఇవే ఆ నాలుగు కులాలు. వారి అవసరాలు, వారి ఆకాంక్షలు, వారి సంక్షేమమే మా
ప్రభుత్వ ప్రాధాన్యతలు’’ అని నిర్మల వివరించారు.
తమ ప్రభుత్వం అనుసరించిన మంచి
విధానాలు, చేపట్టిన పనులే బీజేపీని వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకొస్తాయని నిర్మలా
సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేసారు.