వారణాసి
జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలోని వ్యాసుని నేలమాళిగలో 30 ఏళ్ళ తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి.
హిందువులు
పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది. కోర్టు
ఆదేశాలు వెలువడిన గంటల్లోనే అక్కడ పూజలు జరిగాయి.
వ్యాస
నేలమాళిగలో పూజలకు కోర్టు అనుమతి ఇవ్వడంపై కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే
ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఏ పక్షానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవన్నారు.
కోర్టు తీర్పును ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి
కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా స్వాగతించారు. శివ భక్తులకు న్యాయం జరిగిందన్నారు. ప్రతీ
హిందువు హృదయంలో వారణాసి కోర్టు తీర్పు సంతోషాన్ని నింపిందని విశ్వహిందూ
పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు.
జ్ఞానవాపీ
మసీదులో వివాదంపై బుధవారం ఇరువర్గాల వాదనలు విన్న వారణాసి జిల్లా కోర్టు, వ్యాస్
నేలమాళిగలో పూజలకు అనుమతి ఇచ్చింది. వారంలోపు పూజలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు
ఆదేశాలు జారీ చేసింది.
నేటి
తెల్లవారు జామున ఉదయం మూడు గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం పలు క్రతువులు, వైదిక
కార్యక్రమాలు జరిగాయి. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం భారీ బందోబస్తు
ఏర్పాటు చేసింది.
వ్యాస
కుటుంబం తరఫున పిటిషన్ దాఖలు చేసిన శైలేంద్రకుమార్ పాఠక్, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన తాత కూడా
1993 వరకు అక్కడ పూజలు చేసేవారని వివరించారు. పూజలు నిలిపివేయాలని 1993లో అప్పటి
ములాయంసింగ్ యాదవ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కోర్టు అనుమతితో పూజ నిర్వహించడం
ఆనందంగా ఉందన్నారు. సూర్యోదయం కంటే ముందే మంగళహారతి కార్యక్రమం నిర్వహించామన్నారు.