భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను (hemant soren arrest) ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారంనాడు సుదీర్ఘంగా విచారించిన అనంతరం హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. సోరెన్ జైలుకెళ్లాల్సి రావడంతో ఝార్ఖండ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. జేఎంఎం సంకీర్ణ కూటమి శాసనసభాపక్ష నేతగా రవాణా మంత్రి చంపయీ సోరెన్‌ను ఎన్నుకున్నారు.
బుధవారం నాడు రాంచీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. హేమంత్ సోరెన్ నివాసంలోనే ఈడీ అధికారులు ఆయన్ను 7 గంటలకుపైగా విచారించారు. తరవాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. హేమంత్ సోరెన్ అరెస్టు సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోరెన్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన నివాసంతోపాటు, రాంచీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
హేమంత్ సోరెన్ జైలుకెళితే ఆయన భార్య కల్పనా సోరెన్‌ను సీఎం చేస్తారని రెండు రోజుల ఊహాగానాలకు అనూహ్యంగా తెరపడింది. కుటుంబంలో విభేదాలు రావడంతో చివరకు పార్టీ సీనియర్ నాయకుడు, రవాణా మంత్రి చంపయీ సోరెన్‌ను సంకీర్ణ కూటమి పక్ష నేతగా ఎన్నుకున్నారు. కల్పనా సోరెన్‌కు సీఎం పదవి ఇవ్వడానికి వీల్లేదని తొటి కోడలు సీతా అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది.
రోజంతా నాటకీయ పరిణామాలు
బుధవారం మధ్యాహ్నం ఈడీ అధికారులు రాంచీలోని హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. విచారణకు ముందే భారీగా భద్రత కావాలని ఈడీ అధికారులు ప్రభుత్వానికి అర్జీపెట్టారు. మనీలాండరింగ్ కేసులో 7 గంటలు విచారించారు. తరవాత ఈడీ కార్యాలయానికి తరలించారు. అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. చాలా ప్రశ్నలకు సోరెన్ సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. హేమంత్ సోరెన్ రాజీనామాను గవర్నర్ బుధవారంనాడు ఆమోదం తెలిపారు.
చంపయీ సోరెన్ ఎన్నిక
హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో రాంచీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. హేమంత్ సోరెన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపగానే, జేఎంఎం సంకీర్ణ పక్ష నేతగా చంపయీ సోరెన్‌ను ఎన్నుకున్నారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలిపారు.చంపయీ సోరెన్ 1991 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌ను అత్యంత ఆప్తుడుకావడం విశేషం.
రచ్చకెక్కిన సోరెన్ ఇంటిపోరు
హేమంత్ సోరెన్ అరెస్ట్ తప్పదని రెండు రోజుల కిందటే తెలియడంతో మంగళవారంనాడు ఆయన కొన్ని గంటల పాటు కనిపించకుండా పోయారు. దీని వెనుక కేజ్రీవాల్ ఉన్నారని కూడా విమర్శలు వచ్చాయి. ఇక హేమంత్ సోరెన్ జైలుకు వెళితే ఆయన భార్య కల్పనా సోరెన్ సీఎం అవుతారనే వార్తలు హల్‌చల్ చేశాయి. ఆమె ఆశలకు పెద్దకోడలు సీతా సోరెన్ అడ్డుకట్ట వేశారు. అసలు ఎమ్మెల్యేగా ఎన్నికవని, ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని కల్పనే ఎందుకు? పార్టీలో చాలా మంది సీనియర్ నేతలున్నారని సీతా సోరెన్ అడ్డంతిరిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో కల్పనా సోరెన్‌ను పక్కకు పెట్టి చంపయీ సోరెన్‌ను తెరమీదకు తెచ్చారు.