Notice to Manisankar Aiyar and his daughter to vacate house
కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్, ఆయన
కుమార్తె సురన్యా అయ్యర్ ఢిల్లీ జంగ్‌పురాలోని తమ ఇంటిని ఖాళీ చేయాలంటూ
రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నోటీసులు పంపించింది. సురన్య సోషల్ మీడియాలో
పెట్టిన ఒక పోస్టే దానికి కారణం. ఆ పోస్ట్‌లో ఆమె బాలరాముడి ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమాన్ని వ్యతిరేకించింది.
జనవరి 22న అయోధ్యలో కొత్తగా
నిర్మిస్తున్న రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది.
దానికి రెండు రోజుల ముందే ఆ కార్యక్రమాన్ని తప్పుపడుతూ మణిశంకర్ అయ్యర్ కుమార్తె
సురన్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ వల్ల కాలనీలో నివసిస్తున్న
ఇతరుల మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని మణి, ఆయన కూతురు నివసిస్తున్న భవనం
సంక్షేమ సంఘం, వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. సాటి పౌరుల మతపరమైన మనోభావాలను
గాయపరచడం, శాంతియుతమైన వాతావరణాన్ని చెదరగొట్టే అలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆ
నోటీసులో పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలను తాము ఎంతమాత్రమూ మెచ్చుకోబోమని స్పష్టం
చేసారు.
‘‘అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠకు
వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం సరైనది అనుకుంటే మీరు దయచేసి మరో కాలనీకి
వెళ్ళిపోవాలని సూచిస్తున్నాం. మీరు
వ్యాపింపజేసే అలాంటి ద్వేషాన్ని చూస్తూ ఊరకనే ఉండిపోయేవారు నివసించే చోటకు వెళ్ళిపోండి’’
అని ఆ నోటీసులో పేర్కొన్నారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను
నిరసిస్తూ నిరాహార దీక్ష చేపట్టినట్లు సురన్యా
అయ్యర్ జనవరి 20న ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టింది. బాధలో మునిగిపోయి ఉన్న ముస్లిం
పౌరులకు సంఘీభావం, వారిపట్ల ప్రేమను వెల్లడించేందుకు, వారి ఆవేదనలో
పాలుపంచుకునేందుకు ఈ దీక్ష నిర్ణయం తీసుకుందని వెల్లడించింది.
దానికి ప్రతిగా రెసిడెంట్స్ వెల్ఫేర్
అసోసియేషన్ నోటీసులు జారీ చేసింది. ‘‘సురన్యా అయ్యర్ తన సోషల్ మీడియా ద్వారా చేసిన
వ్యాఖ్యలు ఒక విద్యావంతురాలు చేసినట్లు లేవు. అయోధ్యలో 500 ఏళ్ళ తర్వాత గుడి నిర్మాణం
జరుగుతోంది, అది కూడా సుప్రీంకోర్టు 5-0తో ఇచ్చిన తీర్పు ఆధారంగా జరుగుతోంది. ఆ
విషయాన్ని ఆమె అర్ధం చేసుకుని ఉండాల్సింది. మీరు వాక్ స్వాతంత్ర్యం అనే ముసుగు కింద
దాగవచ్చు, కానీ గుర్తుంచుకోండి, సుప్రీంకోర్టు ప్రకారం వాక్ స్వాతంత్ర్యం,
సంపూర్ణమైనది కాదు’’ అని ఆ నోటీసులో వెల్లడించారు.
తన కూతురి పోస్ట్‌ను ఖండించవలసిందిగా,
లేనిపక్షంలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందిగా మణిశంకర్ అయ్యర్‌ను వెల్ఫేర్
అసోసియేషన్ కోరింది. ప్రజలను రెచ్చగొట్టవద్దని, వారిమధ్య ద్వేషాన్నీ, అపనమ్మకాన్నీ
వ్యాపింపజేయవద్దనీ అసోసియేషన్ వారికి విజ్ఞప్తి చేసింది.
‘‘రాజకీయాల్లో మీరు మీ
దేశం మంచి కోసం అంటూ ఏమైనా చేయవచ్చు, కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ మాటలు, మీ
చేతలు కాలనీకి మంచిదో చెడ్డదో ఏదో ఒక పేరు తీసుకొస్తున్నాయి. కాబట్టి అలాంటి
పోస్ట్‌లు పెట్టకుండా లేదా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆగాలని మిమ్మల్ని అర్ధిస్తున్నాం’’
అని ఆ నోటీసు పేర్కొంది.