ఆమ్
ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ
మరోసారి నోటీసులు జారీ చేసింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు
కావాలని నోటీసులో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న దిల్లీలోని ఈడీ ఆఫీసులో
విచారణకు హాజరు కావాలని తాఖీదులో తెలిపారు.
ఇప్పటికే
నాలుగు సార్లు ఈడీ నోటీసులు అందజేసినా విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు అయ్యారు.
తాజాగా ఐదోసారి తాఖీదులు జారీ చేసింది.
గత
ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 22, ఈ ఏడాది జనవరి 2, 18న విచారణకు హాజరుకావాలని నోటీసులు
జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ స్పందించలేదు.
తాజా సమన్లకు కూడా స్పందించకపోతే
అరెస్టు వారెంటు కోసం ఈడీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముంది.
రాజకీయ
ప్రతీకార చర్యలకు ఈడీని బీజేపీ వాడుకుంటోందని ఆప్ ఆరోపిస్తోంది. సార్వత్రిక
ఎన్నికలకు ముందు తమ నేతను ప్రచారం నుంచి దూరం చేసేందుకే సమన్లు జారీ చేసిందని ఆప్
వాదిస్తోంది.
ఆప్
నేతల విమర్శలను బీజేపీ తిప్పికొడుతోంది. కేజ్రీవాల్ విచారణకు హాజరై తన సచ్చీలతను
నిరూపించుకోవాలని బదులిస్తోంది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా
పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.