Heritage tourism in India gaining popularity across the World, says President
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ
పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆమె
గత పదేళ్ళలో దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి భారత ప్రభుత్వం చేసిన కృషిని,
సాధించిన విజయాలను కొనియాడారు. దేశం నలుమూలలా వివిధ పుణ్యక్షేత్రాలు, చరిత్ర
ప్రసిద్ధి కలిగిన ప్రదేశాలకు ప్రాచుర్యం కలిగించడం ద్వారా పర్యాటక రంగం గణనీయంగా
అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి చెప్పారు.
‘‘యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
కల్పించడంలో పర్యాటకరంగం కీలక భూమిక వహిస్తోంది. గత పదేళ్ళలో మా ప్రభుత్వం పర్యాటక
రంగంలో గణనీయమైన కృషి చేసింది. ఫలితంగా దేశీయ పర్యాటకుల సంఖ్యతో పాటు భారతదేశానికి
వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది’’ అని రాష్ట్రపతి చెప్పారు.
‘‘ప్రపంచంలో భారతదేశం స్థాయి పెరుగుతున్నందువలనే
పర్యాటకరంగం అభివృద్ధి చెందుతోంది. ఇవాళ ప్రపంచం భారతదేశం గురించి మరింత ఎక్కువగా
తెలుసుకోవాలని భావిస్తోంది. పైగా దేశవ్యాప్తంగా కనెక్టివిటీ అద్భుతంగా పెరిగింది. దాంతో పర్యాటకానికి
అవకాశాలూ పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మాణమయ్యాయి.
ఇప్పుడు ఈశాన్యభారతానికి రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తున్నారు. ఇక అండమాన్
నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో పర్యటించడానికి ఉత్సాహం పెరుగుతోంది’’ అని
వివరించారు.
‘‘దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు,
చరిత్రప్రసిద్ధమైన ప్రదేశాలను అభివృద్ధి చేయడం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
వహించింది. ఇవాళ దేశంలో పుణ్యక్షేత్రాల సందర్శన సులభతరమైంది. అదే సమయంలో,
భారతదేశంలో సాంస్కృతిక కేంద్రాల్లో పర్యటించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి
పెరుగుతోంది. గత ఒక్క ఏడాదిలోనే కాశీని 8.5కోట్ల మంది సందర్శించారు. ఉజ్జయిని
మహాకాళుడిని 5కోట్లకు పైగా ప్రజలు సందర్శించుకున్నారు. కేదారనాథ్‌ను 19లక్షల
మందికి పైగా దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన 5 రోజులలో 13లక్షల
మంది భక్తులు అయోధ్యను దర్శించారు. దేశం నలుమూలలా పుణ్యక్షేత్రాల్లో మౌలిక వసతులు,
సదుపాయాలు అసాధారణ స్థాయిలో విస్తరించాయి’’ అని రాష్ట్రపతి చెప్పుకొచ్చారు.
‘‘అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, వివిధ
రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులు, ప్రదర్శనల నిర్వహణకు అందరూ భారతదేశానికే
రావాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికోసమే భారత్ మండపం, యశోభూమి వంటి సౌకర్యాలు
కల్పించారు, సమీప భవిష్యత్తులో ఉపాధికల్పనకు పర్యాటక రంగమే ప్రధాన వనరు కాగలదు’’
అని రాష్ట్రపతి తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేసారు.