TN HC directs HR CE dept to restrict non hindus’ entry into temples
హిందూ దేవాలయాల్లోకి హైందవేతరులు
కోడిమారం (ధ్వజస్తంభం) దాటి ప్రవేశించకూడదంటూ తమిళనాడులోని అన్ని గుడుల దగ్గరా
బోర్డులు పెట్టాలని ఆ రాష్ట్ర దేవదాయ శాఖను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. హిందువులకు తమ మతాన్ని బహిరంగంగా
ప్రకటించడానికీ, అనుసరించడానికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయని గుర్తుచేసింది.
హైకోర్టు మదురై బెంచ్‌లో డి సెందిల్
కుమార్ అనే వ్యక్తి ఒక పిటిషన్ వేసారు. అరుళ్‌మిగు పళని దండాయుధపాణి స్వామి ఆలయం,
దాని ఉపాలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.
ఆ మేరకు అన్ని ప్రవేశద్వారాల వద్దా బోర్డులు పెట్టాలని అర్ధించారు. ఆ పిటిషన్‌ను విచారించిన
న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి, పైవిధంగా తీర్పునిచ్చారు.
అరుళ్‌మిగు పళని దండాయుధపాణి ఆలయం దిండిగల్
జిల్లా పళనిలో ఉన్న ప్రసిద్ధమైన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం. ఈ కేసులో ప్రతివాదులుగా
తమిళనాడు ప్రభుత్వ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవదాయ శాఖ కమిషనర్, పళని
ఆలయం ఈఓ ఉన్నారు.
పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం,
అన్ని దేవాలయాల ప్రవేశద్వారాలు వద్ద, ధ్వజస్తంభాల దగ్గర, గుడులలోని ప్రముఖ ప్రదేశాల్లోనూ
స్పష్టంగా కనబడేలా బోర్డులు పెట్టమని ఆదేశించింది. ‘హిందువులు కానివారు గుడిలో కోడిమార్గం దాటి ముందుకు అనుమతించబడరు’ అని ఆ బోర్డుల్లో
స్పష్టంగా రాసిపెట్టాలని ఆదేశించింది.
‘‘హిందూమతం అంటే నమ్మకం లేని
హైందవేతరులను ఆలయాల్లోకి ప్రవేశించనీయరాదని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసాము.
ఎవరైనా హైందవేతరులు గుడిలోని ఒక దేవతను దర్శించుకోవాలనుకుంటే, వారు ఆ
దేవతామూర్తిపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారనీ, హిందూ మతానికి చెందిన ఆచార
వ్యవహారాలను తుచ తప్పకుండా పాటిస్తారనీ, ఆలయ ఆచార సంప్రదాయాలకు లోబడి ఉంటారనీ ఒక లేఖ
ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే హైందవేతరులను గుడిలోనికి వెళ్ళనివ్వాలి’’ అని
న్యాయస్థానం తన తీర్పులో చెప్పుకొచ్చింది.
హైందవేతరులు అలాంటి లేఖ ఇచ్చి గుడి ఆవరణలోకి
ప్రవేశిస్తే ఆ విషయాన్ని ఒక రిజిస్టర్‌లో పొందుపరచాలని ఆదేశించింది. ఆ రిజిస్టర్‌ను
ఆలయ ఆవరణలో భద్రపరచాలని సూచించింది.
‘‘ప్రతివాదులు ఆలయ పరిసరాలను ఆగమ
శాస్త్రాల్లో చెప్పిన పద్ధతిలో శుభ్రంగా నిర్వహించాలి. ఆలయం ఆచార వ్యవహారాలను
కచ్చితంగా పాటించాలి’’ అని కూడా న్యాయమూర్తి చెప్పారు.
అయితే ప్రతివాదులు, ఈ పిటిషన్ ఒక్క పళని కోవెల
గురించి మాత్రమే వేసినందున న్యాయస్థానం తన తీర్పును ఆ ఒక్క దేవాలయానికే పరిమితం
చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసారు.
‘‘కానీ అ అంశం చాలా పెద్ద విషయం. అది
అన్ని హిందూ దేవాలయాలకూ వర్తిస్తుంది. ఆ నిర్ణయాన్ని అన్ని హిందూ దేవాలయాలకూ
వర్తింపజేయాలి. ఈ నియమ నిబంధనలు వేర్వేరు మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి,
సమాజంలో శాంతి నెలకొల్పడానికీ ఉద్దేశించినవి. కాబట్టి రాష్ట్రప్రభుత్వం, దేవదాయ
శాఖ, ప్రతివాదులైన అందరు కక్షిదారులూ హిందూ దేవాలయాలకు సంబంధించిన ఈ ఆదేశాలను అమలు
చేయాలి’’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
హిందూ మతస్తులకు తమ మతాన్ని బహిరంగంగా
వెల్లడించడానికి, దాన్ని పాటించడానికీ హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. ‘‘అలాగే
ఇతర మతాలకు చెందిన ప్రజలు తమ మతాన్ని అనుసరించడానికీ, ప్రచారం చేసుకోడానికీ హక్కు ఉంది. కానీ ఆ మతస్తుల ఆచారాలూ
పద్ధతులూ హిందూమత ఆచార సంప్రదాయాలను అనుసరించేలా ఉంటే అలాంటి జోక్యాన్ని తగ్గించాలి.
హిందూ దేవాలయం విహారయాత్రా స్థలమో, పర్యాటక స్థలమో కాదు. తంజావూరులోని అరుళ్‌మిగు
బృహదీశ్వర ఆలయంలో సైతం ఇతర మతస్తులను అక్కడి శిల్ప వైభవాన్ని చూసి ఆనందించడానికి
అనుమతిస్తున్నారు, కానీ కోడిమారం (ధ్వజస్తంభం) దాటి వెళ్ళకూడదన్న నిబంధన అక్కడ
అమల్లో ఉంది. అక్కడి శిల్పాలను, నిర్మాణ వైచిత్రినీ చూసి ఆనందించవచ్చు తప్ప ఆ
ప్రదేశాన్ని విహారయాత్రా స్థలంగానో, పర్యాటక స్థలంగానో భావించకూడదు. ఆలయ ఆవరణలను
ఆగమాలను అనుసరించి పూర్తి గౌరవంతో నిర్వహించాలి. హిందూమతంపై ఎలాంటి నమ్మకమూ,
విశ్వాసమూ లేని వారిని హిందూ ఆలయాలలోకి ప్రవేశింపజేయడానికి ప్రతివాదులకు
రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎలాంటి హక్కులూ కల్పించడం లేదు. పైగా, ఆ హక్కులు
అన్ని మతాల వారికీ ఇచ్చినవి, వాటిని ఉపయోగించుకోడంలో ఎలాంటి పాక్షికతకూ తావు లేదు’’
అని కోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను
సైతం ప్రస్తావించింది. ‘‘కొన్నాళ్ళ క్రితం కొందరు అన్యమతస్తులు ఏదో పర్యాటక
స్థలంలోకి వెళ్ళినట్లు తంజావూరు బృహదీశ్వరాలయంలోకి ప్రవేశించి, ఆలయ ఆవరణలో
మాంసాహారం భుజించినట్లు వార్తలు వచ్చాయి. ఈ యేడాది జనవరి 11న మదురై మీనాక్షి దేవాలయంలోకి
కొందరు అన్యమతస్తులు వారి ‘పవిత్రగ్రంథం’తో ప్రవేశించి, గర్భగుడిలో తమ మత
ప్రార్థనలు చేయడానికి ప్రయత్నించారు. ఆ సంఘటనలు భారత రాజ్యాంగం హిందువులకు ఇచ్చిన
ప్రాథమిక హక్కుల్లోకి చొరబడిపోవడం, జోక్యం చేసుకోవడమే’’ అని జడ్జి
వ్యాఖ్యానించారు.
‘‘హిందువులకు కూడా తమ మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోడానికి,
పాటించడానికీ, ఇతర మతస్తులకు అడ్డం కలగకుండా తమ మతాన్ని ప్రచారం చేసుకోడానికీ
ప్రాథమిక హక్కులున్నాయి. కాబట్టి హిందువులు తమ గుడులను తమ సంప్రదాయాలు, ఆచారాల మేరకు
నిర్వహించుకోవచ్చు. పైన చెప్పినటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఆలయాలను
రక్షించాల్సిన బాధ్యత, విధి దేవదాయ శాఖ మీద ఉంది. నిజానికి పైన చెప్పిన సంఘటనల్లో
భారత రాజ్యాంగం హిందువులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో దేవదాయ శాఖ
విఫలమైంది’’ అని మదరాసు హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి ఎస్ శ్రీమతి స్పష్టంగా
వివరించారు.