“Why I killed Gandhi” by Godse
గాంధీని 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్చి
చంపాడు. ఆ కేసు విచారణ 1948 మే 27న మొదలై, 1949 ఫిబ్రవరి 10న ముగిసింది. గాడ్సేకు
మరణశిక్ష విధించారు. పంజాబ్ హైకోర్టుకు పెట్టుకున్న అప్పీలును కోర్టు ఆమోదించలేదు.
ఆ సమయంలో పంజాబ్ హైకోర్ట్ సెషన్ సిమ్లాలో జరుగుతోంది. 1949 మే 5న సిమ్లాలో
జరుగుతున్న పంజాబ్ హైకోర్ట్ విచారణలో నాథూరాం గాడ్సే తన వాదన వినిపించాడు. ఆ
వాదనలో తాను గాంధీని ఎందుకు హత్య చేసాడో వివరించాడు. గాడ్సే వాదన అతని మాటల్లోనే చదువుదాం.
********** ********** **********
సంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన
నేను సహజంగానే హిందూమతాన్ని, హిందూ చరిత్రను, హిందూ సంస్కృతిని గౌరవించేవాణ్ణి. మొత్తంగా
హిందుత్వం అంటే నాకు గర్వం. నేను ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి రాజకీయ లేదా మతపరమైన
ఇజాలకు గుడ్డిగా వంతపాడని స్వేచ్ఛాయుత ఆలోచనా ధోరణిని అలవరచుకున్నాను. అందుకే నేను
అంటరానితనాన్ని, పుట్టుకతో వచ్చే కులవ్యవస్థనూ నిర్మూలించడానికి నేను క్రియాశీలంగా
పనిచేసాను. నేను బహిరంగంగానే ఆర్ఎస్ఎస్ వారి కులవ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నాను.
సామాజిక, మత హక్కుల విషయాల్లో హిందువులందరికీ సమానస్థాయి ఉంటుందన్నది నా విధానం.
వ్యక్తుల హెచ్చుతగ్గులను కేవలం ప్రతిభతో మాత్రమే పరిగణించాలి తప్ప ఏదైనా కులంలో
పుట్టడం వల్ల కాదన్నది నా అనుకోలు.
నేను బహిరంగంగానే కుల వ్యతిరేక భోజన
కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాణ్ణి. ఆ కార్యక్రమాల్లో వేల సంఖ్యలో హిందువులు –
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, చమార్‌లు (మాదిగలు), భంగీలు (పాకీపనివారు) –
పాల్గొనేవారు. మేము కుల కట్టుబాట్లను ఛేదించి అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. నేను
ప్రాచీన, ఆధునిక భారత చరిత్రలతో పాటు ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా దేశాల
చరిత్రలనూ చదివాను. రావణుడు, చాణక్యుడు, దాదాభాయ్ నౌరోజీ, వివేకానంద, గోఖలే, తిలక్
వంటి వారి ప్రసంగాలు, రచనలను పఠించాను. ఇంకా సోషలిజం, మార్క్సిజం వంటి
సిద్ధాంతాలను కూడా అధ్యయనం చేసాను. వాటన్నిటి కంటె ఎక్కువగా నేను వీర సావర్కర్,
గాంధీజీ రచనలు, ప్రసంగాలను గాఢంగా అధ్యయనం చేసాను. ఎందుకంటే గత ముప్ఫై ఏళ్ళకు
పైబడి ఆ ఇద్దరి సిద్ధాంతాలూ భారతదేశ ప్రజల ఆలోచనలు, ఆచరణలనూ తీవ్రంగా ప్రభావితం
చేసాయి.
ఇంత అధ్యయనమూ, ఆలోచనల ఫలితంగా నేనొక
నిర్ణయానికి వచ్చాను. ఒక ప్రపంచ పౌరుడిగా, ఒక దేశభక్తుడిగా హిందువులను,
హిందూత్వాన్ని సేవించడమే నా ప్రథమ కర్తవ్యం. ప్రపంచ జనాభాలో ఐదోవంతు ఉన్న భారతీయుల,
అంటే సుమారు 30కోట్ల మంది హిందువుల ప్రయోజనాలను పరిరక్షించడం, వారికి స్వేచ్ఛను
కల్పించడం భారతదేశ స్వాతంత్ర్యానికి, భారతదేశం మంచికీ అవసరం. ఆ నిబద్ధతే నన్ను హిందూ
సనాతన ధర్మానికి అంకితం చేసుకునేలా నన్ను నడిపించింది. ఆ సనాతన ధర్మమే నా మాతృభూమి
అయిన హిందుస్తాన్ జాతీయ స్వాతంత్ర్యాన్ని సాధించగలదని, మానవాళికి నిజమైన సేవ
చేయగలదనీ నేను విశ్వసించాను.
1920 నుంచి అంటే లోకమాన్య తిలక్ మరణం
తర్వాత, కాంగ్రెస్ మీద గాంధీజీ ప్రభావం పెరుగుతూ వచ్చి, చివరికి అదే అత్యుత్తమం
అన్నస్థాయికి చేరుకుంది. ప్రజలను జాగృతులను చేయడంలో ఆయన కార్యకలాపాలు చాలా
గొప్పవి. దేశానికి ఆయన బోధించిన సత్యం, అహింస అన్న నినాదాలు భారతీయులను మేలుకొలిపాయి.
జ్ఞానము, తెలివి కలిగిన ఏ వ్యక్తీ ఆ నినాదాలకు అభ్యంతరపెట్టడు. నిజానికి వాటిలో
కొత్తదీ లేదా ఆయనకే సొంతమైనదీ ఏదీ లేదు. ప్రతీ రాజ్యాంగబద్ధమైన ప్రజా ఉద్యమంలోనూ
అవి అంతర్భాగంగా ఉన్నాయి. కానీ మీరు ఒకసారి ఆలోచిస్తే మానవాళి తన దైనందిన జీవితంలో
ఎప్పటికీ ఈ గంభీరమైన నియమాలకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండడం అనేది కేవలం కల
మాత్రమే తప్ప మరింకేమీ కాదు.
నిజానికి మనకు మన బంధుమిత్రుల పట్ల, మన
దేశం పట్ల ఉండే ప్రేమ, గౌరవం, విధి మనను అహింసను పక్కన పెట్టి, బలాన్ని
ప్రయోగించేలా చేస్తాయి. ఒక అణచివేతను ఎదుర్కోడానికి సాయుధ పోరాటం చేయడం అన్యాయం
అని నేను భావించలేను. అలా ఎదుర్కోడాన్ని, వీలైతే శత్రువును తన బలంతో ఓడించడాన్నీ
మతపరమైన, నైతికమైన విధిగా భావిస్తాను. రాముడు రావణుడితో భయంకరమైన యుద్ధం చేసి
సీతను విడిపించాడు. కంసుడి దుష్కృత్యాలను అంతం చేయడానికి కృష్ణుడు అతన్ని
సంహరించాడు. అర్జునుడు తన బంధుమిత్రులు, గురువులతో యుద్ధం చేసి వారిని హతమార్చాడు.
ఆఖరికి తాను అమితంగా గౌరవించి పూజించే భీష్ముడిని సైతం, దుష్టుల పక్షాన
పోరాడుతున్న కారణానికి, తుదముట్టించాడు. నా ఉద్దేశంలో రాముణ్ణి, కృష్ణుణ్ణి,
అర్జునుణ్ణి హింసకు పాల్పడిన నేరస్తులుగా చూపడం ద్వారా మహాత్మా గాంధీ అజ్ఞానులైన
ప్రజలను మోసం చేసాడు.
ఇటీవలి చరిత్రనే చూస్తే, భారతదేశంలో ముస్లిముల
దౌర్జన్యాన్ని మొదట గుర్తించి, వారిపై పోరాడి వారిని అంతం చేసినది ఛత్రపతి శివాజీ వీరోచితంగా
చేసిన యుద్ధం. తనమీద దాడి చేసిన అఫ్జల్ ఖాన్‌ను ఓడించి చంపడం శివాజీకి అత్యంత
అవసరం, లేదంటే తనే ప్రాణాలు కోల్పోయేవాడు. చరిత్రలోని గొప్ప యోధులైన శివాజీ,
రాణాప్రతాప్, గురుగోవింద్‌సింగ్ వంటివారిని దారితప్పిన దేశభక్తులుగా ఖండించడం
ద్వారా గాంధీజీ తన దురహంకారాన్ని తానే స్వయంగా బైటపెట్టుకున్నాడు. సత్యం, అహింసల
పేరిట దేశానికి చెప్పాపెట్టకుండా విపత్తులను తెచ్చిపెట్టిన, హింసాత్మక శాంతికాముకుడైన
ఆయన ఒక పెద్ద వైరుధ్యాల పుట్టగా మిగిలిపోయాడు. అదే సమయంలో రాణాప్రతాప్, శివాజీ,
గురుగోవిందసింగ్ ఎప్పటికీ తమ దేశ ప్రజల గుండెల్లో స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టిన
వీరులుగా నిలిచిపోతారు.
గత 32 ఏళ్ళుగా గాంధీ చర్యలు నన్ను రెచ్చగొడుతూనే
ఉన్నాయి. వాటిలో చిట్టచివరిదిగా ముస్లిముల కోసం ఆయన చేసిన నిరాహారదీక్షతో నన్ను
తీవ్రంగా దెబ్బతీసింది. గాంధీ అనే వ్యక్తి ఉనికిని తక్షణం ముగించివేయాలన్న
నిర్ణయానికి వచ్చేలా చేసింది. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం
గాంధీ గొప్పగా పనిచేసాడు సరే. కానీ భారతదేశానికి తిరిగి వచ్చేసాక, ఆయన ఒక రకమైన మానసిక
ధోరణిని పెంపొందించుకున్నాడు. ఏది సరైనది, ఏది సరి కాదు అన్నది తేల్చడానికి ఆయనే
చివరి న్యాయనిర్ణేత అనే వైఖరిని ఏర్పరచుకున్నాడు. దేశానికి ఆయన నాయకత్వం కావాలంటే
దేశం ఆయనను దోషరహితుడిగా ఒప్పేసుకోవాలి. లేదంటే ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉండిపోతాడు,
తన ధోరణిలో వెళ్ళిపోతాడు.
అలాంటి ధోరణికి వ్యతిరేకంగా ఉండడంలో
మధ్యేమార్గం లేదు. ఆయన అసాధారణతకు, విచిత్ర ధోరణికి, ఆధిభౌతికతకు, ఆదిమ దృష్టికీ కాంగ్రెస్
లొంగిపోయి ఆయన చెప్పినట్టు ఆడాలి. లేదా ఆయనను వదిలిపెట్టేసి ముందుకు నడవాలి. ప్రతీ
ఒక్కరికీ, ప్రతీ ఒక్క విషయానికీ ఆయనే న్యాయనిర్ణేత. శాసనోల్లంఘన ఉద్యమాన్ని
నడిపించిన మహామేధావి ఆయనే. ఆ ఉద్యమం ఎలా నడవాలో మరింకెవరికీ తెలియదు. ఆ ఉద్యమాన్ని
ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఉపసంహరించుకోవాలో ఆయన ఒక్కడికే తెలుసు. ఆ ఉద్యమం
సఫలమవుతుందో లేక విఫలమవుతుందో, అది దేశం మీదకు కొత్త విపత్తులను తెచ్చిపెడుతుందో,
రాజకీయంగా తిరగబడుతుందో… ఏది ఏమైనా, దోషరహితుడైన ఆయనకు ఆ ఫలితాలేవీ అంటవు,
వాటితో ఆయనకు సంబంధమే ఉండదు. ‘ఒక సత్యాగ్రహి ఎప్పటికీ విఫలం చెందడు’ అన్నదే ఆయన
సూత్రం. అదే ఆయన దోషరాహిత్యాన్ని ప్రకటిస్తుంది. అయితే సత్యాగ్రహి అంటే ఎవరో ఆయనకు
తప్ప మరెవరికీ తెలీదు. అలా ఆయనే న్యాయమూర్తి, న్యాయనిర్ణేత అయిపోయాడు. అలాంటి
చిన్నపిల్లల మొరకుతనం, మంకుపట్టు, పిచ్చితనం, మూర్ఖపు పట్టుదల, జీవితం పట్ల
కాఠిన్యం, విరామం లేని పని, గాంభీర్యత అన్నీ కలిసి గాంధీని బలీయమైనవాడిగా,
ఎదురులేనివాడిగా చేసాయి.
గాంధీ రాజకీయాలు నిర్హేతుకమైనవి అని
చాలామంది భావించారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ నుంచి వైదొలగిపోవాలి లేదా తమ తెలివిని
ఆయన పాదాల దగ్గర వదిలేసి ఆయన చెప్పినట్టు ఆడాలి. అలాంటి పరిపూర్ణ బాధ్యతారహితమైన
స్థానంలో గాంధీ తప్పు మీద తప్పు చేస్తూ వరుస ఓటములు, విధ్వంసాలకు కారణమయ్యాడు. భారతదేశపు
జాతీయ భాష విషయంలో గాంధీ ముస్లిం అనుకూల వైఖరి ఆయన వక్రబుద్ధికి నిదర్శనం. జాతీయ భాషగా
మొట్టమొదట హిందీని అత్యధికులు ఆమోదించారనేది సుస్పష్టమైన విషయం. భారతదేశంలో తన
ప్రారంభ దినాల్లో గాంధీ హిందీకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాడు. కానీ అది ముస్లిములకు
నచ్చలేదని గ్రహించగానే ఆయన ఆలోచన మారిపోయింది. ఆయన హిందుస్తానీకి ప్రాధాన్యత
ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే హిందుస్తానీ అనే భాషే లేదని భారతీయులందరికీ తెలుసు.
దానికి వ్యాకరణం లేదు, పదసంపద లేదు. అది ఒక యాస మాత్రమే. దానికి మాట తప్ప లిపి
లేదు. అది హిందీ, ఉర్దూ భాషల అక్రమసంతానం. మహాత్ముడి కుతంత్రాలు సైతం దానికి
ప్రజాదరణ కల్పించలేకపోయాయి. ఐతే ముస్లిములను బుజ్జగించాలనే తన కోరికలో ఆయన హిందుస్తానీయే
దేశభాష కావాలని పట్టుపట్టాడు. సరే, ఆయన గుడ్డి అనుచరులు ఆయనకే మద్దతు పలికారు, ఆ
సంకర భాష వాడడం మొదలుపెట్టారు. ముస్లిములనుసంతోషపెట్టే
ప్రయత్నంలో హిందీ భాష స్వచ్ఛతను సంతలో బేరానికి పెట్టేసారు. ఆయన చేసిన అన్ని
ప్రయోగాలూ హిందువులకు భారమే అయ్యాయి.
1946 ఆగస్టు మొదలు ముస్లింలీగ్ నేతల
ప్రైవేటు సైన్యాలు హిందువులను ఊచకోత కోయసాగాయి. అప్పటి వైస్రాయ్ లార్డ్ వావెల్
జరుగుతున్న సంఘటనలతో బాధపడ్డాడు కానీ అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, గృహ దహనాలను నివారించేందుకు
భారత ప్రభుత్వ చట్టం 1935 కింద తనకున్న అధికారాలను వినియోగించలేదు. బెంగాల్ నుంచి
కరాచీ వరకూ హిందువుల రక్తం ఏరులై పారింది. హిందువులు అక్కడక్కడా ప్రతిఘటించినా అది
నామమాత్రమే.
సెప్టెంబర్‌లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది.
కానీ దానికి ముస్లింలీగ్ సభ్యులు పురిట్లోనే సంధి కొట్టారు. ఐతే, వారు భాగస్వాములుగా
ఉన్న ప్రభుత్వానికే వారు అవిధేయులుగా, ద్రోహులుగా మారేకొద్దీ గాంధీకి వారిమీద
వ్యామోహం పెరుగుతూ వచ్చింది. ఆ పరిస్థితిని పరిష్కరించలేకపోవడంతో లార్డ్ వావెల్
రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో లార్డ్ మౌంట్‌బాటన్ వచ్చాడు. తన జాతీయవాదాన్నీ,
సోషలిజాన్నీ గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్, అక్షరాలా నుదుటి మీద తుపాకి పెట్టి బెదిరించడంతో,
జిన్నాకు లొంగిపోయింది, రహస్యంగా పాకిస్తాన్ ఏర్పాటుకు అంగీకరించేసింది. భారతదేశాన్ని
నిలువునా నరికేసారు. 1947 ఆగస్టు 15 నుంచీ భారత భూభాగంలో మూడోవంతు మనకు పరాయి గడ్డ
అయిపోయింది.
కాంగ్రెస్ వారు లార్డ్ మౌంట్‌బాటన్‌ను దేశచరిత్రలోనే
అతిగొప్ప వైస్రాయ్, గవర్నర్ జనరల్ అంటూ వర్ణించడం మొదలుపెట్టారు. అధికారాన్ని
అప్పగించడానికి అధికారికంగా 1948 జూన్ 30 తేదీ నిర్ణయించారు. కానీ మౌంట్‌బాటన్ తన
నిర్దాక్షిణ్యమైన కార్యాచరణతో పది నెలలు ముందుగానే దేశాన్ని కోసిపారేసాడు. తన ముప్ఫై
యేళ్ళ ఎదురులేని నిరంకుశ నియంతృత్వం తర్వాత గాంధీ సాధించింది అదే. ఇంక దాన్ని
కాంగ్రెస్ ‘స్వాతంత్ర్యమ’నీ, ‘శాంతిపూర్వక అధికారమార్పిడి’ అనీ పిలుచుకోడం మొదలుపెట్టింది.
ఎట్టకేలకు హిందూ ముస్లిం ఐక్యత అనే గాలిబుడగ పేలిపోయింది. నెహ్రూ, అతని మంద
ఆమోదంతో మతరాజ్యం ఏర్పడింది. వాళ్ళు దాన్ని ‘త్యాగంతో గెలుచుకున్న స్వాతంత్ర్యం’
అని పిలిచారు. ఇంతకీ త్యాగం ఎవరిది? మనం దైవంగా పూజించే మన దేశాన్ని గాంధీ
అనుమతితో కాంగ్రెస్ అగ్రనాయకులు విభజించి ముక్కలు చేసినప్పుడే నా మనస్సు భయంకరమైన
క్రోధంతో నిండిపోయింది.
హిందూ శరణార్థులు ఢిల్లీలోని మసీదుల్లో
తలదాచుకున్నప్పుడు గాంధీ ఆమరణ నిరాహారదీక్ష చేసాడు. దాన్ని విరమించడానికి ఆయన పెట్టిన
షరతుల్లో, హిందువులు ఆ మసీదులను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నది ప్రధానమైనది. కానీ
పాకిస్తాన్‌లోని హిందువులను ఊచకోత కోస్తున్నప్పుడు ఆయన నిరసన వ్యక్తం చేయలేదు,
కనీసం ఒక్క మాటయినా మాట్లాడలేదు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కానీ, అక్కడున్న
ముస్లిములను కానీ ఆక్షేపించలేదు. గాంధీ ఏదైనా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు
దాన్ని విరమించడానికి షరతులు పెట్టాలంటే అది పాకిస్తాన్‌లోని ముస్లిములకు
సంబంధించినదైతే వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ షరతుకు ఒప్పుకోరనీ, తను చచ్చిపోయినా
పట్టించుకోరనీ గాంధీకి కచ్చితంగా తెలుసు. అందుకే ఆయన ఉద్దేశపూర్వకంగానే ముస్లిములకు
ఏనాడూ ఎలాంటి షరతులూ విధించలేదు. తాను చేసిన నిరాహారదీక్షలకు జిన్నా ఏనాడూ
ప్రభావితం కాలేదనీ, అసలు ఎప్పుడూ పట్టించుకోలేదనీ గాంధీకి పూర్తిగా తెలుసు. గాంధీ
అంతర్వాణికి ముస్లింలీగ్ నయాపైసా అంత విలువైనా ఎప్పుడూ ఇవ్వలేదన్న సంగతి గాంధీకి
చాలాబాగా తెలుసు.
గాంధీని జాతిపిత అని పిలుస్తున్నారు. అదే
నిజమైతే, ఆయన తండ్రిగా తన విధి నిర్వహణలో విఫలమయ్యాడు. దేశ విభజనకు ఒప్పుకోవడం
ద్వారా ఆయన దేశానికి ఎనలేని ద్రోహం చేసాడు. గాంధీ తన విధినిర్వహణలో విఫలమయ్యాడని
నేను బల్లగుద్ది చెప్పగలను. ఆయన పాకిస్తాన్ జాతిపితగా నిరూపించుకున్నాడు. ఆయన
అంతర్వాణి, ఆయన ఆధ్యాత్మిక శక్తి, ఆయన అహింసా సిద్ధాంతం అన్నీ జిన్నా ఉక్కుపట్టుదల
ముందు నిస్సత్తువతో కుప్పకూలిపోయాయి. క్లుప్తంగా చెప్పాలంటే నేను గాంధీని చంపాల్సి
వస్తే నా పరిస్థితి ఏమవుతుందో నేను బాగా ఆలోచించాను. నేను పూర్తిగా నాశనమైపోతానన్న
సంగతి నాకు బాగా తెలుసు. ఈ దేశ ప్రజల నుంచి నాకు అమితమైన ద్వేషం మాత్రమే
లభిస్తుందని అర్ధం చేసుకున్నాను. నా జీవితం కంటె విలువైన నా గౌరవాన్ని కోల్పోతాననీ
గ్రహించాను. కానీ అదే సమయంలో గాంధీ లేని భారత రాజకీయాలు కచ్చితంగా మరింత వాస్తవికంగా
ఉంటాయని, శత్రువులను ప్రతిఘటించగలుగుతాయని, సాయుధ బలగాలతో శక్తివంతంగా తయారవుతాయనీ
నాకు తెలుసు. నా వ్యక్తిగత భవిష్యత్తు పూర్తిగా నాశనమై పోతుందనడంలో సందేహమే లేదు,
కానీ నా దేశం పాకిస్తాన్ నుంచి రక్షించబడుతుంది. జనాలు నన్ను మూర్ఖుడు, తెలివి
లేనివాడు అని పిలవవచ్చు. కానీ దేశం తన మార్గాన్ని తానే ఎంచుకోగల స్వతంత్రాన్ని
సాధిస్తుంది. దృఢమైన దేశ నిర్మాణం కోసం ఆ స్వతంత్రం అవసరమని నా ఉద్దేశం.
ఈ విషయంలో పూర్తిగా ఆలోచించి నేను తుది
నిర్ణయం తీసుకున్నాను. కానీ దీనిగురించి నేను ఎవరితోనూ ఏ కొంచెమైనా మాట్లాడలేదు.
నేను నా రెండు చేతుల్లోకీ ధైర్యాన్ని కూడదీసుకున్నాను. 1948 జనవరి 30న బిర్లాహౌస్‌లోని
ప్రార్ధనాస్థలం దగ్గర గాంధీజీ మీద తుపాకీగుళ్ళు కాల్చాను. ఎవరి విధానాలు, ఎవరి
కార్యాచరణ లక్షలాది హిందువులను నాశనం చేసాయో, ధ్వంసం చేసాయో ఆ వ్యక్తిని నేను
కాల్చాను. అటువంటి దోషిని శిక్షించడానికి తగిన న్యాయ పద్ధతి లేనే లేదు. ఆ కారణం
వల్లనే నేను ఆ వ్యక్తిని కాల్చక తప్పలేదు. ఏ ఒక్కరిపట్లా నాకు వ్యక్తిగతమైన
చెడుభావనలు లేవు. కానీ అన్యాయంగా ముస్లిములకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత
ప్రభుత్వ విధానాల పట్ల నాకు గౌరవం లేదు. అదే సమయంలో ప్రభుత్వ విధానాలు అలా
ఉండడానికి మొత్తం కారణం గాంధీ ఉనికే అని నేను స్పష్టంగా గ్రహించాను.
నేను ఒక విషయం గొప్ప బాధతో చెబుతున్నాను.
ప్రధానమంత్రి నెహ్రూ, భారతదేశం లౌకికరాజ్యం అని మాట్లాడేటప్పుడు, తను చెప్పేదానికీ
చేసేదానికీ పొంతన ఉండదన్న విషయాన్ని చాలా సౌకర్యంగా మరచిపోతాడు. ఈ విషయం ఎందుకు
ముఖ్యమంటే పాకిస్తాన్ అనే మతరాజ్యం ఏర్పాటుల నెహ్రూ పాత్ర కూడా చాలా కీలకమైనది. ఇంక
ముస్లిములను బుజ్జగించడం అనే విషయంలో గాంధీ నిలకడగా అనుసరించిన ధోరణి నెహ్రూ పనిని
మరింత సులువు చేసేసింది.
ఇక ఇప్పుడు నేను ఈ న్యాయస్థానం ముందు
నిలబడి నేను చేసిన పనికి పూర్తిగా బాధ్యత నాదేనని అంగీకరిస్తున్నాను. ఈ విషయంలో నా
కు వ్యతిరేకంగానైనా సరే, న్యాయమూర్తి తగినదిగా భావించి ఏ శిక్షనైనా విధించవచ్చు.
కానీ నేను కోరేది ఒకటే. నామీద ఎలాంటి జాలీ చూపించవద్దు. నాపై కరుణ చూపమంటూ నా తరఫున
ఎవరూ న్యాయస్థానాన్ని అభ్యర్ధించవద్దు. నా చర్యలోని నైతికత గురించి నా విశ్వాసం,
నా మీద అన్నివైపుల నుంచీ వెల్లువెత్తుతున్న విమర్శల వల్ల, అంగుళమైనా తగ్గలేదు.
భవిష్యత్తులో ఏదో ఒకరోజు, చరిత్రను నిజాయితీగా రాసే రచయితలు నా చర్యను
నిష్పాక్షికంగా తూకం వేసి దాని నిజమైన విలువను అంచనా వేస్తారన్న విషయంలో నాకు ఏ
సందేహమూ లేదు.