రేపటి
నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు
జరిగే సమావేశాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్
ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత లోక్సభకు
చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని కేంద్రం
భావిస్తోంది.
ఉదయం
11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అనంతరం 11.30
గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు సభ ముందుకు
రానున్నాయి. ఈ బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చించేందుకు
అనుమతి లభించింది.
గత
సమావేశాల్లో ముఖ్యబిల్లులు అన్నింటిని కేంద్రం ఆమోదించడంతో ఓట్ ఆన్ అకౌంట్ పైనే
కేంద్రం దృష్టిసారించింది.
గత సమావేశాల్లో సస్పెన్షన్ కు గురైన 11 మంది రాజ్యసభ
ఎంపీలపై నిషేధాన్ని ఎత్తివేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి
వినతి మేరకు రాజ్యసభ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
కూడా ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు అంగీకరించారని ఆయన తెలిపారు.
లోక్ సభలో పొగబాంబు ఘటనపై కేంద్ర ప్రభుత్వం వివరణ
ఇవ్వాలంటూ పలువురు ఎంపీలు, రాజ్యసభ, లోక్ సభలో ఆందోళనకు దిగారు. ఘటన పై విచారణ
జరిపే బాధ్యత తనదంటూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించినప్పటీకీ విపక్షాల ఎంపీలు ఆందోళన
చేపట్టి, సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. దీంతో పలువురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు
పడింది.