తెలుగుదేశం
పార్టీ(TDP) ఆవిర్భావం తర్వాత మొదటిసారి రాజ్యసభ(Rajya Sabha )లో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోనుంది. ఆ
పార్టీ నుంచి పెద్దల సభకు ఎన్నికైన సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్
సభ్యత్వం, ఏప్రిల్ తో ముగియనుంది. దీంతో భారత ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్
పరిధిలోని మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికకు ప్రకటన జారీచేసింది. ఫిబ్రవరి 27న ఈ
ఎన్నిక జరగనుంది.
ఒక రాజ్యసభ
స్థానాన్ని గెలుచుకునేందుకు టీడీపీకి 44 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కానీ ఆ పార్టీ
తరఫున ప్రస్తుతం శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న వారు 22 మంది మాత్రమే. వైజాగ్ స్టీల్
ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేయగా ఇటీవలే
స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు.
తాను ఎప్పుడో రాజీనామా చేస్తే స్పీకర్ ఇప్పుడు
ఆమోదించడాన్ని గంటా శ్రీనివాసరావు తప్పుబట్టారు. రాజ్యసభ ఎన్నికల భయంతోనే పాలక
వైసీపీ ఒత్తిడి మేరకు తన రాజీనామాను ఆమోదించారని ఆరోపించారు.
ఒక్క
రాజ్యసభ సీటునైనా గెలుచుకోవాలని టీడీపీ నానా తంటాలు పడుతోంది. తన ఎమ్మెల్యేలతో
పాటు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల ఓట్ల
ద్వారా ఓ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ
జరుగుతోంది. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం
ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. రాజ్య సభ ఎన్నికల గురించి పార్టీ అంతర్గత
సమావేశాల్లో ఎలాంటి చర్చ జరగలేదంటున్నారు.
గత
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాగా టీడీపీ ఏదో ప్లాన్ చేసే అవకాశముందనే అనుమానంతోనే వైసీపీ
జాగ్రత్త పడుతోందనే వాదన కూడా ఉంది. అందుకే గంటా రాజీనామా ఆమోదంతో పాటు రెబల్ ఎమ్మెల్యేల
బహిష్కృత అంశాన్ని లేవనెత్తి ఉంటుందంటున్నారు.
టీడీపీ
ఎత్తులను చిత్తు చేసి అన్ని సీట్లు గెలుచుకోవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ధైర్యం
నింపవచ్చు అని వైసీపీ భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ విజయం తమకు మేలు
చేస్తోందని అంచనా వేస్తోంది.
వచ్చే
ఎన్నికల్లో సీటు దక్కని, లేదా నియోజకవర్గం మారుతున్న ఎమ్మెల్యేలు వైసీపీ హైకమాండ్
పై ఆగ్రహంగా ఉన్నారు. వారంతా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తారని చెప్పలేని
పరిస్థితి. ఏదీఏమైనా ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఆషామాషీకాదు. వైసీపీ అసంతృప్త
ఎమ్మెల్యేల మీద టీడీపీ పెట్టుకున్న ఆశలు నెరవేరడం అంత సులువు కాదు.
ఆంధ్రప్రదేశ్
లో వైసీపీ పాలకపార్టీగా అవతరించిన తర్వాత జరిగిన పెద్దల సభ ఎన్నికల్లో ఆ పార్టీ
అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2020లో
జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను టీడీపీ బరిలో
నిలిపింది. ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేసింది. ఈ సారి కూడా వర్ల రామయ్యకే
అవకాశమిస్తుందని ప్రచారం జరుగుతోంది.
గంటా
శ్రీనివాసరావు రాజీనామాతో ప్రస్తుతం శాసనసభ్యుల బలం 174కు తగ్గింది. ఇందులో సైకిల్
గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు 22 మంది కాగా, ఫ్యాన్ గుర్తుపై ఎన్నికైన వారు 151 మంది, జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన
వారు ఒకరు ఉన్నారు.