RSS is the true heir of Mahatma Gandhi’s legacy
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ మరణించి 75 సంవత్సరాలు (Mahatma
Gandhi Death Anniversary) గడిచిపోయిన ఈ తరుణంలో ఆయన భావాలకు నిజమైన
వారసురాలిగా నిలిచింది రాష్ట్రీయ స్వయంసేవక సంఘమే.
మహాత్మా గాంధీ అచ్చమైన హిందువు. హిందూధర్మం, గోసంరక్షణ,
స్వదేశీ, అస్పృశ్యతా నివారణ వంటి విషయాల్లో ఆయన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి వాటిని
ముందుకు తీసుకువెళ్ళింది రాష్ట్రీయ స్వయంసేవక సంఘమే. (Rashtriya
Swayamsevak Sangh) నిజానికి మహాత్మా గాంధీ సంఘాన్ని ఎంతగానో
అభిమానించారు. 1934లో గాంధీ మహారాష్ట్రలోని వార్ధాలో జరుగుతున్న ఆరెస్సెస్ శిక్షణా
శిబిరాన్ని సందర్శించారు. అక్కడ అన్ని కులాలకు చెందిన యువకులు కలిసిమెలిసి ఉండడం,
ఒకేచోట కూర్చుని తినడం, తోటి స్వయంసేవకుల కులం గురించి పట్టించుకోకపోవడం వంటి
విషయాలను గమనించి ముగ్ధులయ్యారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నెల నాళ్ళకు, 1947
సెప్టెంబర్ 16న, ఆయన ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘నేను చాలా ఏళ్ళ క్రితం ఆర్ఎస్ఎస్ క్యాంపును
సందర్శించాను. అప్పటికి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ బలీరామ్ హెడ్గేవార్
జీవించే ఉన్నారు. మీ క్రమశిక్షణ, నిరాడంబరత, అంటరానితనాన్ని పాటించకపోవడం నన్ను
ముగ్ధుణ్ణి చేసాయి. అప్పటినుంచీ సంఘం బాగా విస్తరించింది. సేవ, స్వీయ త్యాగాలను
ప్రేరణగా తీసుకుని సాగే ఏ సంస్థ అయినా తప్పక బలోపేతమవుతుంది’’ అని గాంధీ
చెప్పుకొచ్చారు.
ఇంకోమాట కూడా చెప్పుకోవాలి. గాంధీ వ్యాప్తం చేసిన సూత్రాల
మీద ఆధారపడిన భారత రాజ్యాంగ పిత డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ (Dr B R Ambedkar)
కూడా
1939లో పుణేలో నిర్వహించిన శిక్షణా శిబిరం ‘సంఘ శిక్షా వర్గ’ను సందర్శించారు.
శిబిరంలో అస్పృశ్యులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. దానికి జవాబిస్తూ హెడ్గేవార్
జవాబిస్తూ సంఘంలో అంటరానివారు, అంటతగినవారు అంటూ లేరని, ఉన్నదల్లా కేవలం హిందువులు
మాత్రమేననీ చెప్పారు. ‘‘స్వయంసేవకులు పూర్తి సమానత్వంతో నడవడం, సోదరభావంతో మెలగడం,
అసలు తోటివారి కులం గురించి పట్టించుకోకపోవడం నన్ను ఆశ్చర్యపరిచాయి’’ అన్నారు
అంబేద్కర్.
గాంధీ-దీనదయాళ్ భావాలు ఒక్కలాంటివే
జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో ‘స్కూల్ ఆఫ్
అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ హెడ్‌గా పనిచేసిన ప్రముఖ రచయిత డాక్టర్ వాల్టర్
ఆండర్సన్ (Dr Walter Anderson) ఆర్ఎస్ఎస్ గురించి
పలు రచనలు చేసారు. దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రబోధించిన ‘ఏకాత్మతా మానవవాదం’ గురించి ఆయన
ఒక వ్యాసం రాసారు. అందులో ఆయన ఒక ఆసక్తికరమైన పరిశీలన చేసారు. గాంధీని, దీనదయాళ్
ఉపాధ్యాయనూ పోలుస్తూ వారిద్దరి భావాలూ ఒక్కలాంటివే అని గమనించారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ (Deen Dayal Upadhyaya)
భారతీయ
జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. జనసంఘ్ కాలాంతరంలో భారతీయ జనతా పార్టీగా
రూపుదిద్దుకుంది. దీనదయాళ్ ప్రబోధించిన ఏకాత్మతా మానవవాదం (Integral
Humanism) బీజేపీ అధికారిక
సిద్ధాంతం. ఆండర్సన్ 1992లో ప్రచురితమైన తనవ్యాసం
‘గాంధీ అండ్ దీనదయాళ్ : టూ సీర్స్’లో వారిద్దరి మధ్యా చాలా పోలికలున్నాయని వివరించారు.
‘‘గాంధీ, ఉపాధ్యాయ ఇద్దరూ ప్రాథమికంగా నిర్వాహకులు.
తాత్విక ఊహాగానాలపై ఆసక్తి, వారికి ద్వితీయ ప్రాధాన్యం మాత్రమే… వాళ్ళిద్దరూ
ప్రజాకర్షణ కలిగిన వ్యక్తులు…’’ అని ఆండర్సన్ రాసుకొచ్చారు. ‘‘భారత జాతీయ
కాంగ్రెస్‌ను గాంధీ మార్చేసారు.. మహాత్ముడిగా ఆయన ప్రజాకర్షణ భారత
స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించే సంస్థగా కాంగ్రెస్‌ను మార్చివేసింది…
దీనదయాళ్ ఉపాధ్యాయ కూడా అలాంటి సాధులక్షణాలు కలిగిన వారే… జనసంఘ్ కార్యకర్తల మీద
ఆయన కూడా అలాంటి ప్రభావమే చూపించారు’’ అని వివరించారు.
గాంధీ, ఉపాధ్యాయ ఇద్దరూ అధికారంలో ప్రత్యక్షంగా
పాలుపంచుకోలేదు. వారిద్దరూ క్షేత్రస్థాయిలో పనిచేసిన మేధావులు. వారి సిద్ధాంతాలు
క్షేత్రస్థాయి అనుభవాల నుంచి రూపుదిద్దుకున్నవి. ‘‘నిజానికి వారిద్దరూ సాధారణంగా
మనం అనుకునే ఉద్దేశంలో మేధావులు కారు. గాంధీ, ఉపాధ్యాయ ఇద్దరూ కూడా పెద్దపెద్ద
అకడమిక్ క్వాలిఫికేషన్స్‌తో, బోలెడన్ని పుస్తకాలు రాసేసి, ధీరగంభీరంగా కనిపించే
మేధావుల లాంటివారు కాదు’’ అని ఆండర్సన్ చెప్పుకొచ్చారు.
అనంతమైన పోలికలు
గాంధీ, దీనదయాళ్ ఉపాధ్యాయ మధ్య పోలికలకు అంతే లేదు.
స్వరాజ్యం, స్వదేశీ అనే సిద్ధాంతాలకు గాంధీ పూర్తి మద్దతుదారుడు. దీనదయాళ్ తన
ఏకాత్మతా మానవవాదంలో అవే తత్వాలను బలంగా సమర్ధించారు. అభివృద్ధికి పాశ్చాత్య
నమూనాలను తిరస్కరించడం అనేది వారిద్దరి ఆలోచనా స్రవంతికి ప్రధాన ఆధారం. ‘‘రాజకీయ
అధికారపు బలం, ప్రజానేతలను అవినీతిపరులను చేసే దాని ప్రభావం మీద వారిద్దరికీ
అనుమానం చాలానే ఉంది. వారిలో ఏ ఒక్కరూ రాజకీయ కార్యాలయం పెట్టలేదు, పెట్టే ఉద్దేశం
కూడా వారికి లేదు’’అని ఆండర్సన్ స్పష్టంగా చెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని నెలలకు గాంధీ తన
అనుంగు సహచరులకు ఒక ముచ్చట చెప్పారు. ‘‘అధికారాన్ని త్యజించడం, నిస్వార్థంగా
స్వచ్ఛంగా సేవలందించడం ద్వారా ఓటర్లకు మనం మార్గదర్శనం చేయడం మాత్రమే కాదు, వారిని
ప్రభావితం చేయగలం’’ అని గాంధీ అన్నారు. ‘‘ప్రభుత్వంలో చేరడం కంటె ఇలాంటి చర్యే
మనకు మరింత ఉన్నతమైన శక్తినిస్తుంది. నేటి
రాజకీయాలు అవినీతిమయం అయిపోయాయి. రాజకీయాల్లోకి వెళ్ళినవారందరూ అవినీతి పంకిలంలో
కూరుకుపోయారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉందాం. అప్పుడే మన ప్రభావం ప్రజలపై బాగా
ఉంటుంది’’ అని రాసారు.
‘‘గాంధీ సూచనను కాంగ్రెస్ పార్టీలోని సహచరులే చాలామంది
తిరస్కరించారు. దురదృష్టవశాత్తూ ఉపాధ్యాయ ఒక రాజకీయ పక్ష నేత. కానీ ఆయన కూడా గాంధీ
చెప్పిన మార్గాన్నే అనుసరించి ఉండేవారు’’ అని ఆండర్సన్ వివరించారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ ఇలా రాసారు, ‘‘నేటి రాజకీయాలు ఒక
మార్గంలా ఉండడం లేదు. అవే ఒక గమ్యంగా మారిపోయాయి. ఇవాళ ప్రజలు రాజకీయ ఆధిపత్యం
కోసం పాకులాడుతున్నారు. అంతే తప్ప రాజకీయాల ద్వారా సామాజిక, జాతీయ లక్ష్యాలను
సాధించడం గురించి ఆలోచించడం లేదు.’’
గాంధీ, దీనదయాళ్ ఉపాధ్యాయ ఇద్దరూ ఒక అభిప్రాయానికి
వచ్చారు. సమాజంలోని వ్యక్తుల స్వభావమే అంతిమంగా రాజ్యం స్వభావాన్ని
నిర్ణయిస్తుంది. అలాంటి ఉత్తమ వ్యక్తులను
తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుని సుమారు శతాబ్దకాలంగా నిర్విరామంగా
పనిచేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్. అందుకే, మహాత్మా గాంధీ ఆశయాల నిజమైన వారసత్వం
దీనదయాళ్ ఉపాధ్యాయ లాంటి నిస్వార్థ దేశభక్తులదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి
సంస్థలదీ.
(మూలం: ది ప్రింట్ 5-10-2019 సంచికలో ప్రచురితమైన అరుణ్ ఆనంద్
రచన ‘వై ఆర్ఎస్ఎస్ థింక్స్ ఇటీజ్ ది ట్రూ హెయిర్ ఆఫ్ మహాత్మా గాంధీస్ లెగసీ’ వ్యాసం)