భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కనిపించకుండా పోయారు. సోమవారం నాడు హేమంత్ సోరెన్‌ను విచారించేందుకు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం అందుబాటులోకి రాలేదు. సోమవారం సాయంత్రం వరకు ఎదురు చూసినా సీఎం హేమంత్ సోరెన్ రాకపోవడంతో, అతనికి చెందిన లగ్జరీ కారును అధికారులు సీజ్ చేశారు.
తాజాగా ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంచీ చేరుకున్నారు. ఇవాళ కూటమి ఎమ్మెల్యేలందరూ సీఎం నివాసంలో సమావేశం కానున్నట్లు సమాచారం అందుతోంది. కూటమి శాసనభ్యులందరూ రాంచీలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గత వారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చినట్లు ఈడీ అధికారుల వద్ద సమాచారం ఉంది. ఆ తరవాత ఆయన ఎక్కడికి వెళ్లారనే దానిపై సమాచారం అందాల్సి ఉంది. సోరెన్‌కు చెందిన జెట్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉందని అధికారులు తెలిపారు. జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఈడీ అధికారులకు రెండు వారాల కిందట సమాచారం ఇచ్చారు. అయితే సోరెన్ రేపు అందుబాటులోకి వస్తారా? లేదా అనేది? తేలాల్సిఉంది.