Fatwa issued to Imam for attending Consecration of Ram Lalla at Ayodhya
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన
ముస్లిం మతపెద్ద మీద ఫత్వా జారీ అయింది. అయోధ్య వెళ్ళినందుకు క్షమాపణ చెప్పాలనీ,
తన పదవికి రాజీనామా చేయాలనీ ఆ ఫత్వాలో పేర్కొన్నారు. అయితే దానికి ఆయన ఘాటుగా
స్పందించారు.
డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ ‘ఆల్ ఇండియా ఇమామ్స్
ఆర్గనైజేషన్’ ప్రధాన ఇమామ్‌గా వ్యవహరిస్తున్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న నూతన రామమందిరంలో
ఇటీవల జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవ్వాలంటూ శ్రీరామజన్మభూమి
తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆయనను ఆహ్వానించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో
పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీకి కూడా ఆహ్వానం పంపించింది. ఆ కార్యక్రమానికి ఉమర్
అహ్మద్ ఇల్యాసీ హాజరయ్యారు.
‘‘బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరైనందుకు నాకు
చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. నా ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో ఉంచి వైరల్
చేసారు. చివరికి సోషల్ మీడియాలోనే నాకు ఫత్వా జారీ చేసారు. అయోధ్య వెళ్ళినందుకు
నేను క్షమాపణ చెప్పాలనీ, ఆలిండియా ఇమామ్స్ ఆర్గనైజేషన్ పదవికి రాజీనామా చేయాలనీ ఆ
ఫత్వాలో పేర్కొన్నారు’’ అని ఇల్యాసీ చెప్పారు.
‘‘ఆ వేడుకకు వెళ్ళాలా వద్దా అని రెండురోజులు ఆలోచించాను.
అది నా జీవితంలోనే అతిపెద్ద నిర్ణయం. మత సామరస్యాన్ని చాటేందుకు, దేశ హితం కోసమే
అక్కడికి వెళ్ళాను. దానికి అక్కడి ప్రజలు, సాధుసంతులు సంతోషించారు. నేను వెళ్ళింది
ప్రేమను పంచడానికి మాత్రమే. మన మతాలు, ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకాలు, ప్రార్థనలు వేర్వేరు
అయి ఉండవచ్చు. కానీ అన్నింటి కంటె మానవత్వం ముఖ్యం. నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి
క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు. నాకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదు’’ అని
ఇల్యాసీ వివరించారు.
‘‘మన దేశం భిన్నత్వంలో
ఏకత్వం కలిగిన సర్వ ధర్మ సంభవ భారతదేశం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం
పురోగమిస్తోంది. మన దేశం చంద్రుడిపై కాలు మోపింది. విశ్వగురువు అవడానికి చేస్తున్న
ప్రయాణంలో మనమంతా ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే దేశం దృఢంగా ఉంటుంది. మన భారతదేశం
అందరి దేశం. అదే దీని గొప్పదనం’’ అని ఇల్యాసీ వ్యాఖ్యానించారు.