Why was Hanuman Flag removed in Karnataka village?
కర్ణాటక
మాండ్యా జిల్లాలో కెరగోడు అనే గ్రామంలో స్థానిక ధార్మిక సంస్థ గతవారం కాషాయరంగులోని
హనుమాన్ ధ్వజం ఎగరవేయడం, దాన్ని అధికారులు తొలగించడం వివాదానికి కారణమైంది. హనుమ
జెండాను మళ్ళీ ఎగురవేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో నిన్న ఆదివారం నుంచీ గ్రామంలో పోలీసులు, భద్రతా దళాలూ మోహరించారు.
ఆ
సంఘటన అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ వివాదంగా మారింది. ఈ
ఉదయం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి.హనుమంతుడి చిత్రాలు ముద్రించిన పాగాలు, తలగుడ్డలు
కట్టుకుని, హనుమాన్ జెండాలు ధరించి ప్రజలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మరోవైపు పోలీసులు, జనాలు గుంపులుగా గుమిగూడకూడదంటూ ఆదేశాలు జారీ చేసారు.
బెంగళూరులో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
కెరగోడు
గ్రామంలో ఆదివారం నాడు బీజేపీ, జేడీఎస్, బజరంగదళ్ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం
చేపట్టారు. ఆ నిరసనను భగ్నం చేయడానికి పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. అయినా కార్యకర్తలు
వెనక్కి తగ్గకపోవడంతో లాఠీచార్జి చేసారు. ఆదివారం సాయంత్రం నుంచీ పోలీసులు ఆ
గ్రామంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ నిషేధాజ్ఞలు విధించారు.
అసలేం
జరిగింది?
కెరగోడు
గ్రామస్తులు, ఆ ప్రాంతానికి చెందిన మరికొందరు కలిసి గ్రామంలోని ఒక ఆలయం దగ్గర
జెండా ఏర్పాటు చేయడానికి నిధులు సేకరించి, ఏర్పాట్లు చేసుకున్నారు. జెండా కోసం
స్తంభం కూడా పెట్టారు. దానిపై కొంతమంది వ్యక్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు
చేసారు. ఆ జెండా తీసేయాలంటూ గ్రామపంచాయతీ అధికారులకు తాలూకా పంచాయతీ ప్రధాన
అధికారి ఆదేశాలు జారీ చేసారు.
అధికారుల
కథనం ప్రకారం శ్రీగౌరీశంకర సేవా ట్రస్ట్‌కు జాతీయ జెండా ఎగరవేయడానికి అనుమతి ఇచ్చారు,
అక్కడ హనుమంతుడి జెండా ఎగురవేయడం నియమాలను ఉల్లంఘించడమే. అందుకే హనుమ జెండా
తొలగించామని అధికారులు చెబుతున్నారు.
అయితే
గ్రామస్తుల వాదన మరోలా ఉంది. జెండా ఎగరవేయడానికి అనుమతి కోరుతూ పెట్టుకున్న అర్జీలో
‘మతపరమైన అవసరాలకు’ అని నిర్దిష్టంగా చెప్పామని గ్రామపంచాయతీ మాజీ ఉపాధ్యక్షుడు
విరూపాక్ష వెల్లడించారు. ‘‘ఈ వివాదంలో నిజానిజాలు ముఖ్యమంత్రికి తెలియవు. జిల్లా
అధికారులు ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చారు’’ అని విరూపాక్ష అన్నారు.
‘‘అనుమతి
కోరుతూ మేము రాసిన లేఖలో మతపరమైన అవసరాలకు అని స్పష్టంగా వివరించాము. కాషాయ రంగు
జెండాను ఎగురవేసుకునేందుకు అనుమతించాలని అడుగుతున్నాము’’ అని వివరించారాయన.
జెండా
వివాదం రాజకీయంగానూ ఉద్రిక్త పరిస్థితులకు
దారితీసింది. పార్లమెంటు ఎన్నికల కోసం జతకట్టిన బీజేపీ, జేడీఎస్ వర్గీయులు అధికార
కాంగ్రెస్ పార్టీ ‘బుజ్జగింపు రాజకీయాలు’ చేస్తోందని మండిపడుతున్నారు. వారు
కెరగోడు నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్ర చేపట్టారు.
ముఖ్యమంత్రి
సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రత్యర్థుల ఆరోపణలను కొట్టిపడేసారు.
ఆదివారం ముఖ్యమంత్రి ఈ ఘటనపై స్పందించారు. జాతీయ జెండాకు బదులుగా అనుమతి లేని
హనుమాన్ జెండా ఎగరేయడం సరికాదన్నారు. ఈ ఉదయం డికె శివకుమార్ మాట్లాడుతూ ‘వాళ్ళు
కావాలంటే రాజకీయు చేసుకోనివ్వండి. కానీ వాళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకూడదు.
మేము అన్ని మతాలనూ గౌరవిస్తాం’ అన్నారు.
ఇవాళ
బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలలోనూ నిరసనలు చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందంటూ మండిపడ్డారు.
ఈ ఉద్రిక్త
పరిస్థితుల నేపథ్యంలో కెరగోడు గ్రామంలో జనజీవనం స్తంభించిపోయింది. పోలీసులు
జెండాస్తంభం దగ్గర బ్యారికేడ్లు పెట్టేసారు. ఊరంతా సీసీటీవీ కెమెరాలు అమర్చారు.
ఇవాళ గ్రామంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. చాలావరకూ దుకాణాలు, వ్యాపారాలూ
మూసివేసారు.