మరో వారం రోజుల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) అమలు చేస్తామని కేంద్ర నౌకాయానశాఖ సహాయ మంత్రి శాంతనూ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లోని ఓ బహిరంగ సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం పశ్చిమబెంగాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సీఏఏ అమల్లోకి రాబోతోందని ఆయన ప్రకటించారు.
1971 తరవాత దేశంలొని వచ్చిన వారి జీవితాలు కూడా సీఏఏ చట్టం అమలుతో బాగుపడతాయని మంత్రి శాంతనూ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మతువా తెగకు చెందిన వారు బీజేపీకి మద్దతు పలుకుతున్నారని వారికి ఓటు హక్కు కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తిరస్కరిస్తోందన్నారు. శాంతనూ ఠాకూర్ పశ్చిమబెంగాల్లోని బంగాన్ నుంచి ఎంపీగా గెలిచారు. అక్కడ మతువా తెగ వారు ఎక్కువగా నివశిస్తున్నారు.
సీఏఏ అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే ప్రకటించారు. దీన్ని ఎవరూ ఆపలేరని అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. అమిత్ షా వ్యాఖ్యలనే మంత్రి శాంతనూ ఠాకూర్ పునరుద్ఘాటించినట్లు తెలుస్తోంది.