Pathetic Condition of Hindu temples and Sikh Gurudwaras in Pakistan
పాకిస్తాన్లో (Pakistan) సిక్కుల పవిత్రక్షేత్రం గురుద్వారా
టిబ్బా నానక్సర్ సాహిబ్ (Gurdwara Tibba Nanaksar Sahib) పరిస్థితి ఏ క్షణంలో కూలిపోతుందో అన్నట్టుంది. సిక్కుమత
వ్యవస్థాపకుడు గురునానక్‌కు (Guru Nanak) సంబంధించిన ఈ గురుద్వారా సాహీవాల్ జిల్లా పాక్పట్టన్లో (Pak Pattan) ఉంది. ఈ చరిత్ర ప్రసిద్ధి కలిగిన క్షేత్రాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా
ఉపేక్షించింది. ఏళ్ళ తరబడిన నిర్లక్ష్యం ఫలితంగా గురుద్వారా శిథిలావస్థకు
చేరుకుంది. చివరికి దాని మనుగడే ప్రశ్నార్థకమైంది. ఆ గొప్ప స్థలం కుప్పకూలిపోకుండా
ఉండాలంటే తక్షణమే దానికి మరమ్మతులు చేయాల్సిన అవసరముంది.
ఆ గురుద్వారా పాక్పట్టన్కు సుమారు 6 కిలోమీటర్ల
దూరంలో ఉంది. బాబా ఫరీద్ అనే సాధువు గురునానక్‌కు ఇక్కడే పవిత్ర బోధనలు చేసాడని చరిత్ర
చెబుతోంది. ఆ బోధనలనే అనంతర కాలంలో సిక్కుల ఐదవ గురువు బాబా అర్జున్ దేవ్ తమ
మతానికి మూలసూత్రం లాంటి గురు గ్రంథ సాహిబ్‌లో చేర్చారు. అలా ఈ గురుద్వారా సిక్కు
మతంలోని ఇద్దరు ప్రముఖుల మధ్య సంబంధం ఏర్పరిచింది. అంతే కాకుండా ఈ ప్రదేశం రెండు
మతాల మధ్య చర్చకు సాక్ష్యంగా కూడా నిలిచింది. తద్వారా సిక్కుమతం ప్రారంభమైన
తొలినాళ్ళలో దాని అభివృద్ధికి ఈ గురుద్వారా తోడ్పడింది.
ఆ గురుద్వారా హద్దులలోపలే బాబా ఫరీద్ వంశానికి
చెందిన బాబా ఫతే ఉల్లా షా నూరీ చిష్తీ సమాధి, మసీదు ఉన్నాయి. వాటికి మాత్రం
ఎప్పటికప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయి, సున్నాలు వేయిస్తున్నారు, నిర్వహణ చక్కగా
జరుగుతోంది. కానీ గురుద్వారాని మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసారు. స్థానిక
గ్రామీణులు ఆ గురుద్వారాని మేకలమందల కోసం పాకలా ఉపయోగించుకుంటున్నారు. దాని గోడలకు
పిడకలు ఎండబెట్టుకుంటున్నారు.
ఇంకా పంజాబ్ ప్రోవిన్స్‌లో కసూర్ చేరువలోని దఫ్తూలో ఉన్న గురుద్వారా (Daftoo Gurdwara) కూడా
బాగా శిథిలమైపోయింది. 17వ శతాబ్దానికి చెందిన సూఫీ కవి, ఉదారవాది బాబా బుల్లేషాకు
ఈ గురుద్వారాతో విశేషమైన సంబంధముంది. ఇస్లామిక్ ఛాందసవాదుల బెదిరింపులతో బుల్లేషా
ఈ గురుద్వారాలో ఆశ్రయం పొందారు. గత జులైలో వర్షాలు, వరదలతో దాదాపు పాకిస్తాన్ అంతా
మునిగిపోయినప్పుడు ఈ గురుద్వారా బాగా దెబ్బతింది. అలా…. పాకిస్తాన్‌లోని
ముస్లిమేతరుల చరిత్రాత్మక ప్రార్థనాస్థలాల పట్ల ఉదాసీనత, ప్రకృతి విపత్తుల కారణంగా
అవి పూర్తిగా శిథిలావస్థకి చేరుకుంటున్నాయి.
దల్వీందర్ సింగ్ పన్నూ (Dalwinder Singh Pannu) రచించిన ‘సిఖ్ హెరిటేజ్
బియాండ్ ద బోర్డర్స్’ (Sikh Heritage beyond the borders) అనే గ్రంథం దఫ్తూలోని గురుద్వారా చారిత్రక విశిష్టతను చాటిచెబుతుంది.
18వ శతాబ్దానికి చెందిన ఓ ప్రసిద్ధ జానపద గాథ, బాబా బుల్లేషా ఆ గురుద్వారాలో ఎలా
ఎందుకు ఆశ్రయం తీసుకోవలసి వచ్చిందో వివరిస్తుంది. ముస్లిం ఛాందసవాదుల ఆగ్రహానికి గురైన
బాబా బుల్లేషా పారిపోతూ ఆ గురుద్వారాలో తలదాచుకున్నాడు. ముస్లిం సైనికులకు అతన్ని
అప్పగించడానికి గురుద్వారా బాధ్యులు ఒప్పుకోలేదు. తమ ప్రార్థనాస్థలం గోడలలోపల
బుల్లేషాకు ఎలాంటి ఆపదా కలగకూడదంటూ సిక్కులు ఆ ముస్లిములను నిలువరించారు.
పన్నూ తన పుస్తకంలో ఆ గురుద్వారా గొప్పదనాన్నీ,
ఇప్పటి శిథిలావస్థనూ తన రచనలో చూపించారు. గురుద్వారా ప్రవేశద్వారం, కిటికీలు, గోపురం,
వాటి శిల్పసౌందర్యం ఎలా ఉండేది, ఇప్పుడది నిర్లక్ష్యం కారణంగా ఎలా శిథిలమైపోయింది
అని వివరించారు. ఆ భవనం ప్రహరీగోడ మీద ఒక వినాయక చక్రం ఉంది, అది ఆ నిర్మాణం
గతవైభవానికి ప్రతీకగా మిగిలిపోయింది.
భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న చరిత్రాత్మక రోరీ
సాహిబ్ గురుద్వారా (Gurdwara Shri Rori Sahib) కూడా ఇటీవలి భారీ వర్షాలకు బాగా దెబ్బతింది. దాని గోడలో
కొంతభాగం కూలిపోయింది. గురునానక్ ఆ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భానికి గుర్తుగా
ఆ గురుద్వారాను నిర్మించారు. కొన్ని వందల యేళ్ళ చరిత్ర ఆ గురుద్వారా సొంతం. దేశ
విభజన తర్వాత పాకిస్తాన్ ప్రాంతంలోకి చేరిన ఆ గురుద్వారా ఇప్పుడు నిర్లక్ష్యం
కారణంగా శిథిలమైపోతోంది.
ఇలా శిథిలమై, నశించిపోతున్న ప్రాచీన అవశేషాల
గురించి పాకిస్తానీ చరిత్రకారుడు ఇమ్రాన్ విలియమ్ ఆవేదన వ్యక్తం చేసాడు. ’సిక్కుల
చరిత్రలో అత్యంత బాధాకరమైన, చీకటి దినాలు అవి’ అని వ్యాఖ్యానించాడు. ఆయన ఇంకొక
విషయాన్ని కూడా వెలుగులోకి తెచ్చాడు. ఈ గురుద్వారాలు ముందునుంచే శిథిలమైపోయి
ఉన్నాయి, వాటిని పరరిక్షించాలన్న విజ్ఞప్తులను పాకిస్తాన్ ప్రభుత్వం ఏమాత్రం
పరిగణనలోకి తీసుకోకుండా వదిలిపెట్టేసింది. ఆ నిర్లక్ష్యం కారణంగానే అవి పూర్తిగా
నాశనమైపోతున్నాయి.
చరిత్రకారుడు అమర్దీప్ సింగ్ (Amardeep Singh) డాక్యుమెంటరీ
‘ఎలెగరీ – ఎ టేపెస్ట్రీ ఆఫ్ గురు నానక్ ట్రావెల్స్’లో (Allegory: A tapestry of Guru Nanak Travels) రోరీ సాహిబ్ గురుద్వారా
గురించి చెప్పాడు. ఆ గురుద్వారాను భాయ్ వాధ్వా సింగ్ నిర్మించాడు. గురునానక్, ఆయన
అనుచరులు కలిసి జైన సంప్రదాయానికి చెందిన వారితో ఆధ్యాత్మిక చర్చలు జరిపిన విశేష
స్థలంలో ఆ గురుద్వారా నిర్మాణం జరిగింది. జైన సంప్రదాయానికి చెందిన కొంతమంది నానక్
బోధనతో ప్రభావితులై ఆయన శిష్యులయ్యారు కూడా. అలాంటి పవిత్రస్థలం ఇలా ఉపేక్షకు గురవడం
బాధాకరం. అక్కడ ఒక పెద్ద చెరువు ఉండేది, ఇప్పుడు ఎండిపోయింది. కేవలం కొన్ని
కళాకృతులు, కుడ్యచిత్రాలు మాత్రమే గతవైభవానికి గుర్తులుగా మిగిలున్నాయి.
కరాచీలోని సోల్జర్ బజార్లో మారీమాతా ఆలయం అనే ఒక
చారిత్రక హిందూ మందిరం ఉండేది. దాన్ని జులై 2023లో ఒక రాత్రిపూట నేలమట్టం
చేసేసారు. ఒక శుక్రవారం రాత్రి కరెంట్ తీసేసి భారీ మిషన్లతో గుడి లోపలి భాగాలను
ధ్వంసం చేసేసారు. ఇప్పుడు బైటి గోడలు, ద్వారాలు మాత్రమే మిగిలున్నాయి. ఆ సమయంలో పోలీసులు కూడా వచ్చారని, దాన్నిబట్టే హిందూదేవాలయంపై
ప్రభుత్వం వైఖరి స్పష్టంగా తెలుస్తోందనీ, స్థానికులు చెబుతున్నారు.
పాకిస్తాన్‌లోని మద్రాసీ హిందువులకు 150 ఏళ్ళనాటి
మారీ మాతా ఆలయం గొప్ప ధార్మిక, సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. ఆలయం శిథిలావస్థకు
చేరుకోవడంతో నిర్వాహకులు గుడిని ఆధునీకరణ చేయాలని భావించి చాలావరకూ దేవతామూర్తులను
సమీపంలోని ఒక గదికి మార్చారు. అయితే అధికారులు ఉన్నట్టుండి ఎలాంటి హెచ్చరికా
లేకుండా గుడిని పడగొట్టేసారు. ఈ సంఘటన కరాచీలో అల్పసంఖ్యాక మతాల వారికి చెందిన
ధార్మిక స్థలాల భద్రత గురించి సవాళ్ళు లేవనెత్తింది.
కరాచీలో హిందూ దేవాలయాన్ని కూలగొట్టేసిన మరునాడే
పాకిస్తాన్లో మరో గుడికి కూడా అలాంటి ముప్పే వచ్చిపడింది. ఘోస్పూర్ పోలీస్
స్టేషన్ పరిధిలోని ఒక హిందూ ఆలయం, చుట్టుపక్కల ఇళ్ళను లక్ష్యం చేసుకుని కొంతమంది
అజ్ఞాత వ్యక్తులు దాడులు చేసారు.
కశ్మీర్లో ‘సేవ్ శారదా కమిటీ’ (Save Sarada Committee) అనే ఒక హిందూ
సంస్థ ఉంది. చారిత్రక హిందూక్షేత్రం శారదాపీఠం వరకూ చేరుకోడానికి వీలు కల్పించాలి
అని ఆ సంస్థ డిమాండ్ చేస్తోంది. శారదాపీఠం ఒకప్పుడు ప్రముఖ విద్యాకేంద్రం. అయితే
పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్ళాక పరిస్థితి మారిపోయింది. శిథిలమైన శారదా ఆలయం
పరిసర ప్రాంతాలను పాకిస్తాన్ సైన్యం అనధికారికంగా కబ్జా చేసిందని సేవ్ శారదా కమిటీ
వ్యవస్థాపకుడు రవీందర్ పండిత్ ఆరోపించారు. పాక్ సైన్యం చర్య, ఆ దేశపు
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అవహేళన చేసేదిగా ఉందని ఆయన వాదన. ఆలయ ప్రాంతపు
కబ్జా, ఆలయం సరిహద్దుగోడను కూలగొట్టడానికి వ్యతిరేకంగా పాక్ పౌరసమాజం తమకు మద్దతు
పలికిందని రవీందర్ చెబుతున్నారు. హిందూ భక్తులు తీర్థయాత్రలు చేసుకోడానికి వీలుగా
శారదాపీఠాన్ని తిరిగి తెరవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
పాకిస్తాన్లో ఎన్నో
చారిత్రాత్మక, ధార్మిక స్థలాలు ప్రభుత్వ ఉపేక్ష వల్ల ఎన్నో అవమానాలు
ఎదుర్కొంటున్నాయి. అల్పసంఖ్యాకుల పూజాస్థలాలపై పాక్ ప్రభుత్వం పూర్తిగా శీతకన్ను
వేసింది. ఫలితంగా గురుద్వారాలు శిథిలమై ధ్వంసమైపోతున్నాయి. పాకిస్తానీ ఛాందసుల
క్రూరచర్యలతో పాటు అల్పసంఖ్యాకుల ధార్మిక స్థలాల పట్ల పాక్ ప్రభుత్వపు చిన్నచూపు
కారణంగా హిందూ ఆలయాలు, సిక్కుల గురుద్వారాలు నేలమట్టమైపోతున్నాయి. ఆ పుణ్యక్షేత్రాల
భద్రత విషయంలో పాక్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎలాంటి పారదర్శకత లేని విధానాల
కారణంగా ఆ ధార్మిక క్షేత్రాల సురక్షపై నీలినీడలు అలముకున్నాయి. సంస్కృతి వినాశనం, తమ
మనోభావాలంటే అమర్యాద పాకిస్తాన్‌లోని అల్పసంఖ్యాకులకు తీవ్ర ఆవేదన
కలిగిస్తున్నాయి.