సీఎం జగన్మోహన్రెడ్డి పాలనకు, వైఎస్ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (ap pcc president ys sharmila reddy) తిరుపతిలో ధ్వజమెత్తారు. నా పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నానన్న ఆమె, ఎంతటి త్యాగానికైనా, పోరాటాలకైనా సిద్దమన్నారు. ఎవరికీ భయపడేదే లేదని, నా ఒంట్లో ప్రవహిస్తోంది వైఎస్ రక్తమని, తాను షర్మిల రెడ్డి అని పునరుద్ఘాటించారు. హంద్రీ, నీవా ప్రాజెక్టును వైఎస్ 90 శాతం పూర్తి చేస్తే మిలిగిన 10 శాతం కూడా జగన్ పూర్తి చేయలేదని ఆమె విమర్శలు గుప్పించారు.
వైఎస్ ఆశయాలు తుంగలో తొక్కిన వారు ఆయన వారసులు ఎలా అవుతారని షర్మిల ప్రశ్నించారు. జగన్ జైళ్లో ఉన్నప్పుడు వైసీపీ బాధ్యతలు భుజాన వేసుకుని 3200 కి.మీ పాదయాత్ర చేసి పార్టీని బతికించానని ఆమె చెప్పుకొచ్చారు. సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం చేస్తామని హామీలిచ్చి ఇప్పుడు జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, పులి కడుపున పులే పుడుతుందని, ఎవరికీ భయపడేది లేదన్నారు.