కేరళలో గవర్నర్, సీఎం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా గవర్నర్ కాన్వాయ్ దిగి రోడ్డుపై కుర్చీ వేసుకుని నిరసన తెలిపారు. గవర్నర్ తీరుపై కేరళ సీఎం పినరయి విజయన్ (kerala cm vijayan) మండిపడ్డారు.
కేరళలో మిలటరీ పాలన కొనసాగుతోందా? అంటూ గవర్నర్ శనివారంనాడు ప్రశ్నించారు. కేరళలో సాయుధదళాలను మోహరించడం విచిత్రంగా ఉందని, పోలీసులు పద్దతి ప్రకారం నడుచుకోవడం లేదంటూ గవర్నర్ నిరసన తెలిపారు. అయితే దానికి సీఎం పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. గవర్నర్‌కు కేంద్రం జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పించింది. ఇప్పుడు సీఆర్పీఎస్ ఆయన కోరుకున్న విధంగా వ్యవహరిస్తోందా? అంటూ సీఎం ప్రశ్నించారు.
అధికారంలో ఉన్న వారిపై నిరసనలు సహజమేనని, స్పందించే ముందు తన స్థాయి గుర్తుపెట్టుకోవాలని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ప్రయాణం చేసేప్పుడు కూడా అనేక మంది నిరసనలు తెలిపారని, ఎన్నడూ కారు దిగి నిరసన తెలపలేదన్నారు.ఒకప్పుడు కేరళ పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించిన గవర్నర్, నేడు వారినే విమర్శించడం దారుణమని విజయన్ అభిప్రాయపడ్డారు.