బిహార్‌లో రాజకీయాలు (Bihar Politics) రసవత్తరంగా మారాయి.
ఇప్పటివరకు మిత్రపక్షాలుగా వ్యవహరించిన పార్టీలు వైరిపక్షాలుగా మారాయి. ముఖ్యమంత్రి
నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ – మాజీ సీఎం లాలూ ప్రసాద్ నాయకత్వం వహిస్తోన్న
ఆర్జేడీ మధ్య పొత్తు రెండేళ్ళకే
తెగతెంపులు అయింది.
బీజేపీతో పొత్తుకు
సిద్ధమైన నితీశ్, ఇప్పటికే పార్టీ ముఖ్యుల
సమ్మతి కూడా తీసుకున్నారు. మరో మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో
బీజేపీ-జేడీయూ కూటమిగా పోటీచేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు సీట్ల సర్దుబాటు కూడా
జరిగింది.
సీఎం నీతీశ్ కుమార్ (Nitish Kumar) గవర్నర్ ను
కలిసి రాజీనామా సమర్పించేందుకు సిద్ధమయ్యారు. బీజేపీతో కలిసి సాయంత్రం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
జేడీయూ ఎమ్మెల్యేలు నేడు పట్నాలోని పార్టీ కార్యాలయానికి చేరుకోగా,
బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాసేపట్లో సమావేశం కాబోతున్నారు.
2022లో బీజేపీ తో పొత్తు నుంచి బయటకు వచ్చిన
నితీశ్ కుమార్, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో కలిసి మహాగట్బంధన్ గా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
జేడీయూ నేత నీరజ్ కుమార్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్
గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. మిత్రపక్షాలు ఎందుకు
దూరమవుతున్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
బిహార్
లో 243 శాసనసభ స్థానాలు ఉండగా ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీకి 79 మంది
ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 122 కావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మరో 43
మంది సభ్యుల మద్దతు అవసరమైంది.
బీజేపీ
ఎమ్మెల్యేలు 78 మంది ఉన్నారు. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ నుంచి కేవలం 45 మంది
మాత్రమే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాంగ్రెస్
నుంచి 19 మంది, సీపీఐ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఇద్దరు , సీపీఐ(ఎమ్-ఎల్) 12
మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరంతా ఆర్జేడీ మద్దతుదారులుగా ఉన్నారు. ఎమ్ఐఎమ్ నుంచి ఒకరు, స్వతంత్ర శాసన సభ్యుడుగా
ఒకరు, హిందూస్థానీ అవామీ మోర్చా నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
నితీశ్
మహాగట్బంధన్ ను వీడితే ఆ కూటమికి మరో 8 మంది ఎమ్మెల్యేల బలం అవసరం అవుతుంది.
జీతన్ రామ్ మాంఝీ
నేతృత్వంలోని హిందుస్థాన్ అవామీ మోర్చా పార్టీ బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు
మద్దతిస్తామని ప్రకటించింది.
నేడు
సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేసి , రేపు
మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. బీజేపీతో దోస్తీ కట్టి మళ్ళీ
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు స్థానికమీడియా విశ్లేషించింది.
బీజేపీకి రెండు ఉపముఖ్యమంత్రి పదవులుతో పాటు స్పీకర్ పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం
జరుగుతోంది.