Twists and turns in Bihar Politics
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీతో
చేతులు కలుపుతారన్న వార్తలు బలం పుంజుకుంటున్నాయి. ఇండీ కూటమి ఏర్పాటులో కీలక
పాత్ర పోషించిన నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీయే వైపు మళ్ళిపోతే ఇండీ కూటమి ఎన్నికల కంటె
ముందే విచ్ఛిన్నమైనట్టే. బిహార్‌లో ఆ
కూటమి కథ కంచికి చేరినట్టే.
నితీష్ కుమార్ చాలాకాలం ఎన్డీయే కూటమిలో
ఉన్నా తర్వాత కాంగ్రెస్‌తోనూ, ఆర్జేడీతోనూ కూడా చేతులు కలిపారు. 2013 నుంచీ నితీష్
పార్టీలు మారుస్తూనే ఉన్నారు. 2022లో బీజేపీతో విడిపోయాక ప్రతిపక్ష పార్టీలు
అన్నింటినీ కలిపి 2024లో నరేంద్రమోదీ మీద యుద్ధానికి కూటమి కట్టేందుకు బీజం
వేసింది నితీషే.
తాజాగా, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ
ఠాకూర్‌కు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన తర్వాత నితీష్ మళ్ళీ
బీజేపీతో చేతులు కలుపుతారన్న ఊహాగానాలు బలపడ్డాయి. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న
ప్రకటించడంపై నితీష్ కుమార్ మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని ప్రశంసించారు.
గతంలో జేడీఎస్-బీజేపీ సంకీర్ణ
ప్రభుత్వంలో నితీష్ క్యాబినెట్లో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నేత
సుశీల్ కుమార్ మోదీ చేసిన మర్మగర్భ వ్యాఖ్యలు
ఆసక్తికరంగా నిలిచాయి. ‘రాజకీయాల్లో ఏ తలుపూ పూర్తిగా మూసుకుపోదు. అవసరమైతే
తలుపులు తెరుచుకుంటాయి’ అన్న సుశీల్ మోదీ వ్యాఖ్యలు బిహార్ రాజకీయ ముఖచిత్రాన్ని
మరింత సందిగ్ధంగా మార్చాయి.
అసలు మోదీకి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్
ఏర్పాటుకు కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన నితీష్, ఆ కూటమినే ఎందుకు
వదిలిపెట్టేస్తున్నట్టు? జనవరి 13న జరిగిన ఇండీ కూటమి సమావేశమే దానికి కారణమని
తెలుస్తోంది. ఆ సమావేశంలో సీపీఎం నేత సీతారాం ఏచూరి, కూటమి కన్వీనర్‌గా నితీష్
కుమార్ పేరును ప్రతిపాదించారు. లాలూ ప్రసాద్, శరద్ పవార్ సహా దాదాపు అందరు
నాయకులూ దానికి ఒప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ అడ్డుపుల్ల వేసింది. రాహుల్ గాంధీ
జోక్యం చేసుకుని, ఆ నిర్ణయాన్ని వాయిదా వేసారు. కన్వీనర్ పదవి నితీష్‌కు ఇవ్వడం పట్ల
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి అభ్యంతరాలున్నాయంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.
ఇండీ కూటమికి నితీష్ గుడ్‌బై చెబుతారు
అనే అంచనాలకు బలం చేకూరుస్తూ పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిహార్ ప్రభుత్వం 79 మంది ఐపీఎస్ అధికారులను,
45మంది బిహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను బదిలీ చేసింది.
ఇదే సమయంలో, ఇవాళ బీజేపీ బిహార్ శాఖ
సమావేశం జరిగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలే ఈ సమావేశం
అజెండా. జేడీయూతో పొత్తు విషయమై వస్తున్న ఊహాగానాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
సమ్రాట్ చౌధరి కొట్టిపడేసారు. అయితే తెరవెనుక చర్చలు ఇప్పటికే మొదలయ్యాయని
సమాచారం.
మరోవైపు, ప్రస్తుతానికి జేడీయూతో కలిసి
అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు కూడా తమ ఎమ్మెల్యేల సమావేశాలు
నిర్వహించాయి. ఐతే, ఆ పార్టీలు కూడా ఈ రాజకీయ చదరంగం గురించి గుంభనంగానే వ్యవహరిస్తున్నాయి.
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ గురించి చర్చించుకోడానికే తమ పార్టీ
సమావేశం జరిగిందంటూ కాంగ్రెస్ చెప్పుకొస్తోంది.
నితీష్ కుమార్ జేడీయూ ఇప్పుడు కాంగ్రెస్,
ఆర్జేడీల నుంచి విడిపోయే ప్రక్రియ జరుగుతోందని రాజకీయ వర్గాల సమాచారం. ఆ ప్రక్రియ
పూర్తయాక బీజేపీ-జేడీయూ అధికారికంగానే పొత్తు కుదుర్చుకుంటాయని తెలుస్తోంది. నితీష్
తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనక్కరలేకుండానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణతో
సరిపెట్టేసే అవకాశాలు కూడా లేకపోలేవు.
ఇవాళ్టి బీజేపీ సమావేశంలో ఆ పార్టీ నేతలు,
తమ ఎమ్మెల్యేల నుంచి నితీష్ ముఖ్యమంత్రిత్వానికి మద్దతు లేఖలు తీసుకుంటారని
తెలుస్తోంది. ఆ లేఖలను ఈ రాత్రికి ముఖ్యమంత్రికి అందజేస్తారని సమాచారం.
ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఆదివారం ఉదయం 10
గంటలకు జేడీయూ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశంలోనే బీజేపీతో
పొత్తు గురించి ప్రకటిస్తారనీ, వరుసగా తొమ్మిదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి
చేపడతారనీ రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.