Congress MLA backs BJP MP in Karnataka
ప్రత్యర్ధి పార్టీ నాయకుడు గెలవాలని ఏ పార్టీ
నాయకుడైనా కోరుకుంటాడా? అందునా, కాంగ్రెస్ పార్టీ నేత బీజేపీ ఎంపీ గెలుపు కోసం
సిఫారసు చేస్తాడా? అది నిజంగా జరిగింది. ఎక్కడంటారా… కర్ణాటకలో.
షమనూర్ శివశంకరప్ప కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో
సీనియర్ నాయకుడు, దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తున్న ఎంఎల్ఏ.
శివమొగ్గలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన మీ ఎంపీ బాగా పనిచేస్తున్నాడు,
మళ్ళీ ఎన్నుకోండి అని ఆ నియోజకవర్గ ప్రజలకు సలహా ఇచ్చాడు. ఇంతకీ ఆ ఎంపీ ప్రత్యర్ధి
బీజేపీ నేత. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొడుకు బీవై రాఘవేంద్ర.
శివమొగ్గలో గురు బసవశ్రీ ఆధ్యాత్మిక సదస్సు మరియు
పురస్కారాల ప్రదాన కార్యక్రమం శుక్రవారం నాడు జరిగింది. గురు బసవశ్రీ అవార్డు
స్వీకరించడానికి ఎంఎల్ఏ శివశంకరప్ప ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా
మాట్లాడుతూ స్థానిక ఎంపీని పొగడ్త్లో ముంచెత్తారు.
‘‘శివమొగ్గ జిల్లాలో అభివృద్ధి పనులు బాగా
జరుగుతున్నాయని నేను గమనించాను. మీరు మంచి ఎంపీని ఎన్నుకున్నారు. మీరు అతన్ని
మళ్ళీ ఎన్నుకోవాలి. శివమొగ్గ జిల్లాలో మరింత అభివృద్ధి చోటు చేసుకోవాలి. బీవై
రాఘవేంద్ర లాంటి ఎంపీ ఉండడం మీ అదృష్టం. జిల్లాలో జరగాల్సిన పనులన్నీ పూర్తయ్యాయి,
పురోగతి బాగుంది. ప్రజల అభివృద్ధే ఎవరికైనా మొదటి ప్రాధాన్యం కావాలి’’ అంటూ
శంకరప్ప ప్రసంగించారు.
‘‘ప్రజల మనసులు తెలుసుకుని వాటికి అనుగుణంగా
నడుచుకునే ఎంపీలు రాబోయే ఎన్నికల్లో కూడా గెలవాలి. వీరశైవ లింగాయతుల్లో చాలా శాఖలున్నాయి.
అవన్నీ పోవాలి. తామంతా ఒక్కటేనని అందరూ అనుకోవాలి. అప్పుడే ఐకమత్యం వస్తుంది’’ అని
శంకరప్ప శివమొగ్గ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
కర్ణాటకలో కాంగ్రెస్‌కు
ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. తొమ్మిది నెలల క్రితమే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో
చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కొద్దిరోజుల క్రితమే మళ్ళీ బీజేపీలోకి
వెళ్ళిపోయారు. ఇప్పుడు సొంత ఎమ్మెల్యే ప్రత్యర్థి ఎంపీని ప్రశంసల్లో ముంచెత్తడం
ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి పరిణామాలతో
కర్ణాటక కాంగ్రెస్ తలలు పట్టుకుంటోంది.