వాగ్దానం
మేరకు ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ వేసిన ప్రధాని మోదీని గుండెల్లో పెట్టుకుంటామని,
రాజకీయంగా బీజేపీకి మద్దతు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు.
విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరిని కలిసిన మాదిగ సామాజికవర్గనేతలు,
బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో
నిర్వహించిన మాదిగ విశ్వరూప సభలో ప్రధాని మోదీ పాల్గొని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా
మాట్లాడటాన్ని గుర్తు చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇవ్వడంపై
హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పలికినట్లే దక్షిణాదిలో బీజేపీ
సొంతంగా ఎదిగేలా మాదిగలంతా కలిసికట్టుగా కష్టపడేందుకు సిద్ధమన్నారు.
ప్రతీ
హామీని నెరవేర్చేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా పనిచేస్తోందని పురందరేశ్వరి ఈ
సందర్భంగా బదులిచ్చారు. ప్రధాని మాట ఇస్తే
దానికి తిరుగుండదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మరోసారి మాట్లాడి మాదిగల
సమస్యలను వివరిస్తానన్నారు.
తమ
నేత మందా కృష్ణ ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసినట్లు
ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మాదిగ సామాజికవర్గం అధికంగా
ఉన్న ప్రాంతాలను బీజేపీ నేతలకు వివరించామన్నారు.
కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు
సురేష్ మాదిగ,
మహిళా
నేతలు కరుణ, తబిత, వాణి, జ్యోతి పాల్గొన్నారు.