Major findings by ASI survey at Gyanvapi mosque complex
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని విశ్వనాథ ఆలయాన్ని
ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ నిర్వహించిన సర్వే
నివేదిక న్యాయస్థానానికి అందింది. అంతకుముందు ఎప్పటినుంచో ఉన్న హిందూమందిరాన్ని
పడగొట్టి ఆ ఆలయ శిథిలాలతోనే మసీదును నిర్మించారని ఏఎస్ఐ నివేదిక నిస్సందేహంగా
తేల్చిచెప్పింది.
జ్ఞానవాపి మసీదు సముదాయంలో శాస్త్రీయ
సర్వే నిర్వహించాలని వారణాసి జిల్లా కోర్టు 2023 జులైలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్
ఇండియా – ఏఎస్ఐ సంస్థను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఏఎస్ఐ చేపట్టిన సర్వే గురించి
నివేదికను ఇటీవల న్యాయస్థానానికి అందజేసింది. 839 పేజీల ఆ సుదీర్ఘ నివేదిక, అక్కడ
గతంలో హిందూ ఆలయం ఉండేదనీ, దాన్ని 17వ శతాబ్దంలో ఔరంగజేబు హయాంలో ధ్వంసం చేసారనీ, ఆ ప్రాంగణంలో కొంత భాగాన్ని రూపం మార్చి
ప్రస్తుతమున్న నిర్మాణంగా ఉపయోగించుకుంటున్నారనీ నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పింది.
ఆ నివేదిక ప్రతిని కేసులోని అన్ని పక్షాలకూ అందజేసారు. ఆ నివేదికలోని ప్రధాన
విషయాలు ఇలా ఉన్నాయి.
‘‘కోర్టు ఉత్తర్వుల మేరకు వారణాసిలోని
జ్ఞానవాపి మసీదు సముదాయంలో శాస్త్రీయ అధ్యయనాలు, సర్వే నిర్వహించాము. అక్కడి
నిర్మాణ అవశేషాలు, కనిపిస్తున్న లక్షణాలు, దొరికిన కళాఖండాలు, చెక్కిన శాసనాలు, విగ్రహాలను
అధ్యయనం చేయడం ద్వారా అక్కడ ఇప్పుడు ఉన్న నిర్మాణానికి ముందు గతంలో హిందూ దేవాలయం
ఉండేదని చెప్పవచ్చు.’’
‘‘ఒక గదిలో దొరికిన అరబిక్-పర్షియన్
శాసనంలో ఆ మసీదును ఔరంగజేబు పరిపాలనా కాలంలోని 20వ సంవత్సరంలో నిర్మించినట్లు
ప్రస్తావన ఉంది. అందువల్ల అంతకుముందరి నిర్మాణాన్ని 17వ శతాబ్దంలో ఔరంగజేబు హయాంలోనే
ధ్వంసం చేసినట్లు అర్ధమవుతోంది. అందులో కొంతభాగాన్ని మార్చి ప్రస్తుత నిర్మాణంలో మళ్ళీ
ఉపయోగించారు.’’
‘‘ఇప్పుడు లభ్యమవుతున్న పురావస్తు
అవశేషాలు, గోడల మీది అలంకరణలు, మధ్య మండపంలో ఉన్న కర్ణ రథం, ప్రతి రథం, అలంకరణలతో
కూడిన ప్రవేశద్వారం, పశ్చిమాన ఉన్న మండపంలో తూర్పు గోడ మీద ఉన్న తోరణం, లలాటబింబపు
శిథిలమూర్తితో కూడిన చిన్న ద్వారం, లోపలా బైటా చెక్కిన పక్షులు, జంతువుల బొమ్మలు…
ఇవన్నీ, అక్కడున్న పశ్చిమ కుడ్యం హిందూ మందిరంలో మిగిలిన భాగమేనని సూచిస్తున్నాయి.
దొరికిన కళాఖండాలు, నిర్మాణరీతిని బట్టి అంతకుముందు అక్కడున్నది హిందూ మందిరం అని
గుర్తించవచ్చు.’’
‘‘హిందూ దేవీదేవతల విగ్రహాలు, ఇతర
మూర్తుల రూపాలు భూమిలోపల నేలమాళిగ ఎస్-2లో పాతిపెట్టి కనిపించాయి. అలాగే
అంతకుముందున్న దేవాలయం స్తంభాలను ఇక్కడ తూర్పుభాగంలో సెల్లార్ల నిర్మాణానికి
పునర్వినియోగం చేసారు.’’
‘‘ఒక స్తంభం మీద గంటలు అలంకరించి
ఉన్నాయి. దానికి నాలుగువైపులా దీపపు సెమ్మెలు ఉన్నాయి. శాలివాహన శకం 1669 అంటే
సామాన్యశకం 1613 జనవరి 1న వేసిన శాసనం కూడా ఉంది.’’
‘‘అదనంగా మరికొంత స్థలం కోసం తూర్పున వరుసగా
నేలమాళిగలు కట్టి ఉన్నాయి. పెద్దసంఖ్యలో భక్తులు ప్రార్థనలు చేసుకోడానికి వీలుగా మసీదు
ముందుభాగంలో ఒక పెద్ద వేదిక ఉంది. అక్కడ దొరికిన ఒక శిలాశాసనం ఇప్పుడు ఎఎస్ఐ వద్ద
ఉంది. హద్రత్ ఆలంగీర్, అంటే మొగల్ చక్రవర్తి ఔరంగజేబు పరిపాలిస్తున్న 20వ ఏట
(సామాన్యశకం 1676-77లో) మసీదు నిర్మాణం
జరిగిందని దానిమీద రాసిఉంది. ఇంకా, సామాన్యశకం 1792-93లో మసీదుకు మరమ్మతులు చేయించినట్లు
కూడా ఆ శిలాశాసనం మీద నమోదు చేసి ఉంది. ఆ శిలాశాసనాన్ని ఫొటోలు తీసి ఏఎస్ఐ
రికార్డుల్లో 1965-66లో పొందుపరిచారు.’’
‘‘తాజా సర్వేలో ఆ శిలాశాసనం మసీదులోని ఒక
గదిలో దొరికింది. అయితే మసీదు నిర్మాణం, విస్తరణ గురించి ఆ శాసనం మీద ఉన్న వాక్యాలు
తొలగించివేయబడ్డాయి.’’
‘‘తన పాలనలో ఉన్న అన్ని ప్రోవిన్సులలోనూ ‘కాఫిర్ల
పాఠశాలలు, మందిరాలను ధ్వంసం చేయాలని ఆయా ప్రొవిన్సుల గవర్నర్లకు ఔరంగజేబు ఆదేశాలు
జారీ చేసాడ’ని అతని జీవితచరిత్ర మాసిర్-ఎ-ఆలంగిరీలో రాసిఉంది. చక్రవర్తి ఆదేశాల
మేరకు అతని అధికారులు 1669 సెప్టెంబర్ 2న కావీలోని విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం
చేసినట్లు అదే గ్రంథంలో నమోదు చేయబడింది.’’
‘‘సర్వే చేసినప్పుడు ఇప్పుడున్న
నిర్మాణంలోను, ఇంతకుముందరి నిర్మాణంలోనూ ఎన్నో శిలాశాసనాలు లభించాయి. తాజా సర్వేలో
మొత్తం 34 శిలాశాసనాలను గుర్తించడం జరిగింది. వాటిలో 32 శాసనాలకు నకళ్ళు తీయడం
జరిగింది… … అవి నిజానికి గతంలో ఉన్న హిందూ దేవాలయాల రాళ్ళ మీద చెక్కిన
శాసనాలు. ప్రస్తుతం ఉన్న నిర్మాణం (మసీదు) కట్టేటప్పుడు లేదా మరమ్మతులు
చేసేటప్పుడు ఆ రాళ్ళను మళ్ళీ ఉపయోగించారు. ఆ శాసనాల మీద దేవనాగరి, గ్రంథ, తెలుగు,
కన్నడ లిపులలో రాసి ఉన్నాయి. పురాతన శిలాశాసనాలను ప్రస్తుత నిర్మాణంలో
ఉపయోగించడాన్ని పరిశీలిస్తే, అంతకుముందున్న నిర్మాణాలను ధ్వంసం చేసారనీ, ప్రస్తుతమున్న
నిర్మాణాన్ని నిర్మించే సమయంలో లేదా మరమ్మతులు చేసే సమయంలో ఆ శిథిలాలను మళ్ళీ
వాడారని తెలుస్తోంది.’’
‘‘ఆ శిలాశాసనాల్లో జనార్దన, రుద్ర,
ఉమేశ్వర వంటి దేవీదేవతల పేర్లున్నాయి. మూడు శిలాశాసనాల్లో ప్రస్తావించిన ‘మహాముక్తిమండపం’
వంటి పదాలకు గొప్ప ప్రాధాన్యం ఉంది.’’
‘పిల్లర్స్ అండ్ పిలాస్టర్స్’ అనే
విభాగంలో ఏఎస్ఐ నివేదిక ఇలా చెబుతోంది…
‘‘ప్రస్తుతమున్న నిర్మాణంలోని స్తంభాలు,
దీర్ఘచతురస్రాకార స్తంభాలను శాస్త్రీయంగా, వ్యవస్థీకృతంగా అధ్యయనం చేయడం జరిగింది.
మసీదు విస్తరణకు, శహన్ నిర్మాణానికీ… అంతకుముందున్న ఆలయంలోని స్తంభాలు, వాటి
భాగాలను కొద్దిపాటి మార్పులతో మళ్ళీ ఉపయోగించారు. నడవాలోని పిల్లర్లు, పిలాస్టర్ల
సూక్ష్మ అధ్యయనాలు, అవి నిజానికి అంతకు ముందు ఉనికిలో ఉన్న హిందూ దేవాలయంలోని
భాగాలే, అని సూచించాయి. ప్రస్తుత నిర్మాణంలో ఆ పాత స్తంభాలను మళ్ళీ వాడడానికి
వీలుగా… స్తంభాల మీద పద్మాలకు ఇరుపక్కలా ఉన్న వ్యాళ ఆకృతులను ధ్వంసం చేసారు. ఆ
మూలల్లోని రాతిని తొలగించారు, అక్కడ పూల డిజైన్లు వేసారు. ఈ పరిశీలనను… పశ్చిమ మండపంలోని
ఉత్తర, దక్షిణ కుడ్యాల మీద ఇంకా ఉన్న రెండు పిలాస్టర్లు… సమర్థిస్తున్నాయి.’’
‘‘ఈ ఆలయానికి మధ్యలో పెద్ద మండపం ఉంది. అలాగే
నాలుగు దిక్కుల్లోనూ కనీసం ఒక్కొక్క మండపం ఉంది. ఉత్తరం, దక్షిణం, పశ్చిమ దిక్కుల్లోని
మండపాల ఆనవాళ్ళు ఇప్పటికీ ఇంకా ఉన్నాయి. కానీ తూర్పు దిక్కు మండపం మాత్రం భౌతికంగా
కనిపించడం లేదు. అది ఉండాల్సిన చోట రాతిగచ్చు కట్టేసారు.’’
ముందరి నిర్మాణపు మధ్య మండపం, ఇప్పుడున్న
నిర్మాణపు (మసీదు) మధ్యహాలుగా మారింది. బలమైన మందపాటి గోడలతో ఉన్న ఆ నిర్మాణం,
దాని మీది పుష్పాలంకరణలు, ఇతర నిర్మాణ విశేషాలతో యథాతథంగా మసీదు ప్రధాన హాలుగా
ఉపయోగపడింది. గత నిర్మాణంలో ఉండిన ఆర్చిల దిగువ భాగాల్లో చెక్కిన జంతువుల బొమ్మలు
ధ్వంసం చేయబడ్డాయి. డోమ్ లోపలి భాగం రకరకాల డిజైన్లతో అలంకరించబడి ఉంది.’’
‘‘ఆలయం మధ్యమండపంలోకి పశ్చిమం నుంచి
ప్రవేశించే మార్గం రాతితో మూసివేయబడింది. ఆ ప్రవేశమార్గం జంతువులు, పక్షుల
చెక్కడాలతో అలంకరించబడి ఉంది. అక్కడొక తోరణం కూడా ఉంది. ఆ పెద్ద మార్గంలోనే మరో
చిన్న ప్రవేశమార్గం కూడా ఉంది. దాని మీద చెక్కిన శిల్పాలు ధ్వంసం చేయబడ్డాయి.
అందులోని కొద్దిభాగం ఇప్పుడు కొంచెమే కనిపిస్తోంది. మిగతా భాగమంతా ఇటుకలు, రాళ్ళు,
మోర్టార్తో మూసివేయబడింది.’’
‘‘ఒక తలుపు మీద ఒక పక్షి బొమ్మ శిథిలాలు
కొద్దిగా ఉన్నాయి, వాటిని పరిశీలిస్తే అదొక కోడిపుంజు బొమ్మ అని తెలుస్తోంది.
మూసివేసిన ప్రధానద్వారం వెనుక కిబ్లా ఏర్పాటు చేయబడింది. అది సాదాగా ఉంది, ఎలాంటి
అలంకారాలూ లేవు, అది సమతలంగా ఏమీ లేదు. రెండువైపులా చేసిన ప్లాస్టరింగ్ కూడా సరిగ్గా
లేదు.’’
‘‘పశ్చిమ మండపంలోని తూర్పుభాగం ఇప్పటికీ
ఇంకా ఉంది. అయితే పశ్చిమ భాగం మాత్రం దాదాపు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ మండపం
ఉత్తర, దక్షిణ మండపాలతో ఒక నడవా ద్వారా కలపబడి ఉంది. ఆ నడవాకు ఉత్తర, దక్షిణ
ప్రవేశమార్గాలున్నాయి. ఆ నడవా వాయవ్యభాగంలోని శిథిలాలు చెత్తా చెదారంతో
కప్పబడిపోయి ఉన్నాయి.
‘‘ఇప్పుడు ఉన్న నిర్మాణపు పశ్చిమపు గోడ
గతంలో ఉండిన హిందూ దేవాలయపు అవశేషం. అది రాతితో కట్టబడింది. పడమటి మండపం, మధ్యమండపపు
పశ్చిమ భాగాలు, ఉత్తర దక్షిణాలలోని రెండు మండపాల పశ్చిమపు గోడలతో అది ఏర్పడింది. పక్కలనున్న
మండపాలకు మార్పులు చేయబడ్డాయి కానీ గోడలతో ఏర్పడిన మధ్య మండపం మాత్రం యథాతథంగా
ఉంది.‘‘
‘‘ఈ మండపాలన్నీ నాలుగు వైపులా తెరిచి
ఉండేలా నిర్మించబడ్డాయి. మధ్య, ఉత్తర, దక్షిణ మండపాల ప్రవేశభాగాల మీదున్న ఆర్చిల
మీద అలంకారాలున్నాయి. ఐతే ఇప్పుడు ఆ ప్రవేశపు ఆర్చిలన్నీ మూసివేయబడ్డాయి. ఉత్తర,
దక్షిణ హాళ్ళ ప్రవేశద్వారాలపైని ఆర్చిలు పైకప్పు మీదకు వెళ్ళే మెట్లుగా మార్చివేయబడ్డాయి.
ఉత్తరం వైపున్న అలాంటి మెట్లు ఇప్పటికీ ఇంకా వినియోగంలోనే ఉన్నాయి. దక్షిణం వైపు
మెట్లు మాత్రం రాతితో మూసివేయబడ్డాయి. ఐనా పైకప్పు మీద నుంచి ఆ మెట్ల మీదకు
చేరుకోవడం కష్టమేమీ కాదు. పశ్చిమ మండపం నుంచి మధ్య మండపానికి ముందుండే పెద్ద
ప్రవేశం రాతితో మూసివేయబడింది.’’
‘‘కాబట్టి, గతంలో ఉండిన నిర్మాణాన్ని 17వ
శతాబ్దంలో, ఔరంగజేబు కాలంలో ధ్వంసం చేసారు. అందులోని కొంతభాగాన్ని నవీకరించి
ప్రస్తుత నిర్మాణంలో ఉపయోగించారు. శాస్త్రీయ సర్వేలో దొరికిన నిర్మాణ శిథిలాలు, కళాఖండాలు,
శిలాశాసనాలు, విగ్రహాల అధ్యయనం ద్వారా అక్కడ ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని
కట్టడానికి ముందే హిందూ మందిరం ఉండేదని కచ్చితంగా నిరూపణ అయింది’’ అని ఏఎస్ఐ
నివేదిక స్పష్టం చేసింది.
పశ్చిమపు గోడ దగ్గర చెత్తా చెదారం మధ్యలో
దేవతా విగ్రహాలు శిథిల స్థితిలో దొరికాయి. ఇంకా మరికొన్ని రాతి వస్తువులు సైతం
లభించాయి. ఇళ్ళలో వాడుకునే రోళ్ళు, రోకళ్ళ వంటి వస్తువుల శిథిలాలు కూడా ఉన్నాయి.
కొన్ని శిలాఫలకాలు కూడా ఉన్నాయి, ఇక దొరికిన విగ్రహాల్లో శివలింగం, విష్ణుమూర్తి,
హనుమంతుడు, గణపతి ఇలా ప్రముఖ హిందూ దేవీదేవతల మూర్తులు అక్కడున్నాయి.
సర్వేలో రెండు గాజు వస్తువులు కూడా
దొరికాయి. ఒకటి పగిలిన శివలింగం కాగా మరొకటి పెండెంట్. అలాగే ఆ కట్టడపు ఆవరణలో
రకరకాల నాణేలు దొరికాయి. మూడు నాణేల మీద పర్షియన్ భాషలో రాతలున్నాయి. బ్రిటిష్
ఇండియా కాలానికి చెందిన 64 నాణేలు దొరికాయి. కొన్ని నాణేల మీద ఈస్టిండియా కంపెనీ,
రాణి విక్టోరియా, ఎడ్వర్డ్ 7, జార్జి 5 ముద్రలున్నాయి. మాధవరావు సిందియా ముద్ర
ఉన్న ఒక రాగినాణెం కూడా దొరికింది.