Gaidin Liu, freedom fighter from North East
జనవరి 26 భారతదేశానికి పవిత్రమైన రోజు. భారతదేశం
గణతంత్రంగా నిలిచిన ఉత్సవ దినం. పరాయి పాలన దాస్య శృంఖలాలను తెంచుకున్న భారతావని
స్వీయపరిపాలనకు రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నరోజు. ఈ రోజుకు మరో విశిష్టత కూడా
ఉంది. అదే గైడిన్ ల్యూ జయంతి. ఆమె గొప్ప
వీరురాలు, స్వతంత్రసమర యోధురాలు. ఆమె తన 13వ ఏటనే సాయుధపోరాటం ప్రారంభించింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఆమెకు శాంతి మాత్రం లభించలేదు. నాగాలాండ్ ప్రజలకు
నాగా సంస్కృతే గొప్పది. గైడిన్ ల్యూ నాగాలాండ్ ప్రజల స్వధర్మం, స్వాభిమానం కోసం పోరాడింది.
అందుకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆమె నాగాలాండ్‌లో నాగాల సంస్కృతే
వెల్లివిరియాలని కోరుకుంది. కానీ ఆ రాష్ట్రమంతా క్రైస్తవ మత ప్రచారకుల
గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల దేశ స్వాతంత్ర్యం తర్వాత కూడా గైడిన్ ల్యూ
పోరాటంలో మార్పేమీ రాలేదు. స్వాతంత్ర్యం వచ్చాక ఆమె స్వదేశీ సంస్కృతి కోసం
పోరాటాన్ని కొనసాగించింది. అందువల్ల క్రైస్తవ మిషనరీలు ఆమెను తమ శత్రువుగా
పరిగణించారు.
గైడిన్ ల్యూ 1915 జనవరి 26న నాగాలాండ్‌లోని
రాంగ్మో-నంకవో గ్రామంలో జన్మించింది. అప్పట్లో బ్రిటిష్ వారు నాగాలాండ్‌లో
రెండురకాల పనులు చేస్తుండేవారు. ఒకటి స్థానిక ప్రజల ఆర్థికంగా దెబ్బతీయడం, రెండు
వారిని మతాంతరీకరణ చేయడం.దానికి
వారు తమదైన వ్యూహాన్ని అనుసరించేవారు. మొదట సామాన్య ప్రజల మీద అధిక ధరలు, పన్నుల
భారం మోపేవారు. తర్వాత సహాయం పేరు మీద క్రైస్తవ మిషనరీలు వారి దగ్గరకు వచ్చేవారు. ప్రజలు
ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల కోసం మతం మారాలన్న దారిని సూచించేవారు. అప్పుడు
ప్రభుత్వం కూడా వారికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుండేది. ఫలితంగా పెద్దసంఖ్యలో
ప్రజలు మతం మారడం మొదలైంది.
బ్రిటిష్ వారి ఈ దుర్మార్గపు కుట్రలను
వ్యతిరేకిస్తూ నాగాలాండ్‌లో హెరాకా ఆందోళన మొదలైంది. అదొక సాయుధ పోరాటం, దానికి
జాదోనాగ్ నాయకత్వం వహించేవారు. ఆయన గైడిన్ ల్యూకు వరుసకు మామయ్య. గైడిన్ ల్యూ
చిన్నప్పటినుంచీ తన మామయ్య జాదోనాగ్ విప్లవ పోరాటంలో భాగస్వామిగా ఉండేది. జాదోనాగ్
రహస్య సందేశాలను గైడిన్ ల్యూ ద్వారా పంపించేవారు, తీసుకునేవారు. అలా గైడిన్ ల్యూకు
చిన్నతనం నుంచే విప్లవకారులతో సంబంధాలుండేవి. ఆమె 13ఏళ్ళ వయసులోనే ఆయుధాలు ఉపయోగించడం
నేర్చుకుంది, అంతేకాదు, విప్లవ మార్గంలో ఉన్న మహిళలకు కూడా ఆయధాలు ఉపయోగించడం
నేర్పించేది.
ఆ క్రమంలోనే ఒకసారి జాదోనాగ్ను శత్రువులు
బంధించారు. 1931 ఆగస్టు 29న ఆయనను ఉరితీసారు. ఆ తర్వాత విప్లవకారులకు గైడిన్ ల్యూ
నాయకత్వం వహించింది. 16ఏళ్ళ వయసులోనే టీమ్ కమాండర్ అయింది. ఆమె అతి త్వరలోనే ఒక సాయుధ
బ్రిగేడ్ తయారుచేసింది. అందులో 4వేల మంది విప్లవకారులు ఉండేవారు. వారు నాగా పౌరులు
బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నులు కట్టవద్దని, తమ సంస్కృతికే కట్టుబడి ఉండాలనీ పిలుపునిచ్చారు.
వారిని ఎదుర్కోడానికి బ్రిటిష్ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ దళాన్ని రంగంలోకి
దింపింది. గైడిన్ ల్యూ కోసం వెతుకుతూ
అస్సాం రైఫిల్స్ దళం ఎన్నో గ్రామాలను తగలబెట్టేసింది. ఆమె గురించి ఆచూకీ ఇచ్చిన
వారికి రూ.500 బహుమతి, పన్నుల మాఫీ కూడా ప్రకటించింది.
గైడిన్
ల్యూ బ్రిగేడ్‌కు ఏం చేయాలన్నది సుస్పష్టం. ఒకటి అస్సాం రైఫిల్స్ శిబిరాల మీద దాడి
చేయడం, రెండు మతం మార్చడానికి క్రైస్తవ మిషనరీలు వచ్చే చోట్ల ప్రజలను హెచ్చరించడం.
మూడు బ్రిటిష్ వాళ్ళకు పన్నులు కట్టవద్దంటూ ప్రజల్లో చైతన్యం కలిగించడం. దాంతో
ఇంగ్లీష్ వారు అదిరిపోయారు. గురించి
వెతుకులాట వేగవంతం చేసారు. ఆచూకీ కోసం
ప్రజలను భయపెట్టారు, ప్రలోభపెట్టారు. అలా ఎట్టకేలకు గైడిన్ ల్యూ గురించి సమాచారం తెలుసుకున్నారు. 1933
ఏప్రిల్ 14న బ్రిటిష్ వారు గైడిన్ ల్యూను
అరెస్ట్ చేసారు. ఆవిడ మీద విచారణ చేపట్టారు. జైలులో నిర్బంధించారు. గైడిన్ ల్యూను
గువాహటి, తురా, షిల్లాంగ్ జైళ్ళలో ఉంచి రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు.
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక గైడిన్ ల్యూ జైలునుంచి విడుదలైంది. కానీ ఆమెకు
విశ్రాంతి మాత్రం దొరకలేదు. దానికి కారణం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అయితే
ముగిసింది కానీ వారి నెట్వర్క్ ఎక్కడికక్కడ అలానే ఉంది. ప్రభుత్వంలోనూ,
సమాజంలోనూ బ్రిటిష్ వారి ప్రభావం ఏమాత్రం చెక్కుచెదరలేదు. క్రైస్తవ మిషనరీలు భారతీయ
ప్రజలను మతం మార్చే పని ఎక్కడా ఆగలేదు. గైడిన్ ల్యూ ప్రభుత్వాన్ని నాగా సంస్కృతిని
పరిరక్షించాలని డిమాండ్ చేసింది. అలాగే ఆవిడ నాగా తెగలను సమైక్యం చేసే పని మొదలుపెట్టింది.
కానీ అప్పటి ప్రభుత్వం గైడిన్ ల్యూ చేస్తున్న కృషి మీద విద్రోహచర్య అన్న ముద్ర
వేసింది. దాంతో గైడిన్ ల్యూ మళ్ళీ 1960లో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయింది.
రహస్యంగానే తన కార్యక్రమాలు కొనసాగించింది. అలా చేస్తూనే, ‘నేను భారతీయురాలిని,
నాకు భారత ప్రభుత్వంతో ఘర్షణ లేదు. భారతదేశంలో ఉంటూనే నాగా సంస్కృతి గౌరవాన్ని
నిలబెట్టడం కోసమే నా ప్రయత్నమంతా’ అంటూ భారత ప్రభుత్వానికి సందేశం పంపించింది. 1966లో
భారత ప్రభుత్వానికీ ఆమెకూ సంధి కుదిరింది. అప్పటినుంచీ ఆమె జనజీవన స్రవంతిలోకి
వచ్చేసింది. నాగా సంస్కృతికి గౌరవం కల్పించడం కోసం పాటుపడింది.
గైడిన్ ల్యూకు 1972లో స్వాతంత్ర్య సంగ్రామ సేనాని
అనే గౌరవంతో తామ్రపత్రం ప్రదానం చేసారు. 1982లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది,
1983లో వివేకానంద సేవాసమ్మాన్ ప్రదానం చేసారు. గైడిన్ ల్యూ 1993లో
స్వర్గస్తురాలయ్యింది. 1996లో గైడిన్ ల్యూ స్మృత్యర్థం తపాలా బిళ్ళ విడుదల చేసారు.
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 ఆగస్టు 24న గైడిన్ ల్యూ జ్ఞాపకార్థం ఒక
నాణెం విడుదల చేసారు, ఆమెను రాణి అని సంబోధించారు.