జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. 75వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని మంగళగిరిలో జాతీయజెండాకు వందనం చేసిన తరవాత పవన్ కళ్యాణ్ (janasena chief pawankalyan) కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి, పొత్తు ధర్మంలో భాగంగా తాను కూడా రెండు స్థానాలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాజోలు, రాజానగరంలో జనసేన అభ్యర్థులు బరిలో దిగుతారని చెప్పారు.
తెలుగుదేశంతో కలసే ఎన్నికలకు వెళుతున్నామని పవన్ మరోసారి ప్రకటించారు. ఉమ్మడి మ్యానిఫెస్టో ఉంటుందని, పొత్తులో ఒక సీటు, అటో ఇటోగా ఉంటుందన్నారు. జగన్పై ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని, ఆయనకు ఊరంతా శత్రువులేనన్నారు. వైసీపీ నాయకులకు కష్టం వచ్చినా తన వద్దకు రావాలన్నారు. టీడీపీ, జనసేన పొత్తు చెడకొట్టేలా కొందరు మాట్లాడుతున్నారని, నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.