వారణాసీలోని జ్ఞానవాపి మసీదు
ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ (ASI) అధికారులు నిర్వహించిన సర్వేలో
పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నివేదికలోని అంశాలను హిందూ పక్షం తరఫున వాదనలు
వినిపిస్తోన్న విష్ణు శంకర్ జైన్ మీడియాకు తెలిపారు.
హిందూ దేవతల విగ్రహాలు, అలాగే
పలు శాసనలు గుర్తించినట్లు నివేదికలో ఉందన్నారు.
భారీ హిందూ దేవాలయాన్ని కూల్చి
ఆ స్థానంలో మసీదు నిర్మించారని సర్వేలో తేలిందన్నారు. జీపీఆర్ సర్వేలోని అంశాలను
కూడా ఈ నివేదికలో పొందుపరిచారు.
జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సర్వే
రిపోర్టును జ్ఞానవాపి కేసులోని ఇరుపక్షాలకు చెందిన 11 మంది కక్షిదారులకు అందజేశారు.
పూర్వకట్టడంపైనే మసీదు నిర్మాణం
జరిగిందని నివేదికలో స్పష్టమైంది.
గతంలో ఆలయం ఉండేదని ఆలయం స్తంభాలను, రాళ్లను మసీదు నిర్మాణంలో వినియోగించినట్టు
తేలిందన్నారు. శిల్పరీతిని బట్టి చూస్తే పూర్వం అక్కడ ఆలయం ఉన్నట్టు తేటతెల్లమైంది.
జ్ఞానవాపి
మసీదు ప్రాంగణంలో జరిపిన సర్వేకు సంబంధించి మొత్తం 839 పేజీలతో ఏఎస్ఐ నివేదికను తయారు
చేసి న్యాయస్థానానికి అందజేసింది.
ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర
నిర్మాణాలను మసీదు నిర్మాణంలో కలిపేశారని, ప్రస్తుతం గోడలపై గత నిర్మాణమైన ఆలయ ఆనవాళ్లు ఉన్నాయని నివేదించారు.
గోడలపై 34 శాసనాలు ఉండగా, అవి దేవనగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో ఉన్నాయని
నివేదికలో వివరించారు.
జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు
ఉన్నాయని సర్వే పేర్కొందని హిందూ పిటిషనర్ల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్
వెల్లడించారు. దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయని మరికొన్ని
రిపోర్టులు పేర్కొంటున్నాయన్నారు.