AP BJP Chief attends National Voters Day program at KLU
ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దనున్న శక్తివంతమైన ఆయుధం
ఓటుహక్కు అని, దాన్ని యువ ఓటర్లు సరిగ్గా వినియోగించుకోవాలనీ బీజేపీ రాష్ట్ర
అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. విజయవాడలోని కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి
ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
యువ ఓటర్లయిన విద్యార్ధులను ఉద్దేశించి
ప్రసంగిస్తూ పురందరేశ్వరి, వారి కార్యాచరణ పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు.
యువత దేశం కోసం,రాష్ట్ర అభివృద్ధి
కోసం ఆలోచించి మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. యువత ఓటు హక్కు 2024 ఎన్నికల్లో దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. యువతకు జాతీయ భావాలు ముఖ్యమన్నారు. స్వామి
వివేకానంద ప్రసంగాల నుంచి యువత స్ఫూర్తి పొందాలని సూచించారు.
పురందరేశ్వరి తన ప్రసంగంలో నేడు అంతర్జాతీయ
స్థాయిలో నేడు భారత్కు పెరుగుతున్న ప్రతిష్ట గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ సమర్థ పాలన వల్లనే భారత్ ప్రపంచంలో అజేయశక్తిగా నిలుస్తోందని గుర్తు
చేసారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లోనూ సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా నరేంద్రమోదీ పాలన సాగిస్తున్నారని
తెలిపారు.
భారత పౌరులు గర్వించే విధంగా దేశాన్ని
విశ్వగురు స్థానంలో నిలపడానికి మోదీ అనునిత్యం కృషి చేస్తున్నారని చెప్పారు.
నరేంద్ర మోదీ కృషితో అయోధ్యలో బాలరాముడికి ఐదు వందల సంవత్సరాల తరువాత ప్రాణ ప్రతిష్ఠ
జరగడం దేశానికి గర్వకారణమన్నారు. సరైన సమయంలో మనకు సరైన నాయకత్వం ఉందని సంతృప్తి
వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య
దేశమైన భారత్లో మొదటి సారి 1952లో ఎన్నికలు జరిగిన విధాన్ని
పురందరేశ్వరి విద్యార్ధులకు వివరించారు. ఆనాడు దేశంలో అక్షరాస్యత 32శాతం ఉండగా 78 శాతం పోలింగ్ జరిగిందన్నారు. ఇప్పుడు
అక్షరాస్యత శాతం పెరిగినా పోలింగ్ శాతం 51.52 శాతానికి పడిపోయిందన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో సగానికి పైగా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం
సరికాదన్నారు.
గతంలో నీతివంతమయిన రాజకీయాలు
ఉండేవన్నారు.కానీ నేడు రాజకీయ వ్యవస్థ కలుషితమయిందన్నారు. నేటి ఎన్నికలు కండ బలం, ధన బలం, కుల బలం మీద ఆధారపడ్డాయని అన్నారు. ఇది
ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. 2024 ఎన్నికల్లో యువతరం
సరైన నిర్ణయం తీసుకుని ఓటుహక్కును వినియోగించుకోవాలని పురందరేశ్వరి సూచించారు.
ఈ కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా
వంశీ కృష్ణ, కేఎల్యూ వైస్ ఛాన్సలర్ డా. జి.పార్థసారథి వర్మ తదితరులు
పాల్గొన్నారు.