మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో
కర్ణాటక కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, కాంగ్రెస్
పార్టీని వీడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ వీడి కాంగ్రెస్ లో చేరిన
శెట్టర్ ప్రస్తుతం మళ్ళీ సొంత గూటికి చేరారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం ఆయన భారతీయ
జనతాపార్టీలో చేరారు.
లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ శెట్టర్, ప్రభావవంతమైన
కన్నడ రాజకీయనేతల్లో ఒకరు. గత ఎన్నికల్లో హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ టికెట్
ఇవ్వకపోవడంతో బీజేపీని వీడి కాంగ్రెస్ కండువా మెడలో వేసుకున్నారు. కాంగ్రెస్ తరఫున
అదే స్థానం నుంచి పోటీ చేసి 34 వేల ఓట్ల తేడాతో ఓడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు
ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది.
దాదాపు 9 నెలల పాటు కాంగ్రెస్ లో కొనసాగిన శెట్టర్ ఆ
పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. లోక్
సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని ప్రచారం
జరుగుతోంది.
2012
నుంచి 2013 మధ్య పది నెలల కాలం పాటు
కర్ణాటక సీఎంగా జగదీష్ శెట్టర్ పనిచేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శెట్టర్,
బీజేపీ లో అనేక కీలక పదవులు చేపట్టారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా, ప్రతిపక్షనేతగా,
స్పీకర్ గా పనిచేశారు.