Vanavasi Kalyan Ashram attempt to explore the traditions of Tribals in Eastern ghats
తూర్పు కనుమలలోని గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు,వారసత్వ సంపద వైవిధ్యభరితమని సామాజిక సమరసతా
వేదిక జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ అన్నారు. వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ నిర్వహిస్తున్న
తూర్పు కనుమల యాత్రలో పాల్గొనే విశాఖపట్నం బృందం పర్యటనను ఆయన ప్రారంభించారు. ఆ
సందర్భంగా మాట్లాడుతూ మహోన్నతమైన తూర్పు కనుమల నాగరికతను ప్రపంచానికి
తెలియజేసేందుకు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 4 వరకు
గిరిజన సాంస్కృతిక యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వనవాసీ కళ్యాణ ఆశ్రమం యాత్రా
ప్రముఖ్ ఉబ్బేటి నాగేశ్వరావు నేతృత్వంలో విజయనగరం కేంద్రీయ గిరిజన
విశ్వవిద్యాలయంతో కలిసి ఆంధ్రప్రదేశ్ వనవాసీ
కళ్యాణ ఆశ్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.
సమున్నతమైన గిరిజన జీవన శైలి, సంస్కృతి సాటి
ప్రపంచానికి ఆదర్శమని, గిరిజనుల నుంచి ఎన్నో అంశాలను బాహ్య సమాజం నేర్చుకుంటుందని శాసనమండలి
మాజీ సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
గిరిజన సంస్కృతి తూర్పు కనుమలను సుసంపన్నం చేసిందన్నారు. గిరిజన సంప్రదాయాలు,
సంస్కృతి, కళలు అంతరించిపోకుండా భావితరాలకు అందించడం కోసమే యాత్ర చేపట్టామని ఆర్
ఎస్ ఎస్ విశాఖ నగర సంఘచాలక్ పీవీ నారాయణ రావు అన్నారు. గిరిజనుల సాంప్రదాయిక
పరిజ్ఞానాన్ని దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలన్నారు. గిరిజన ఆచార సంప్రదాయాలు, సంస్కృతి,
హక్కులకు ప్రమాదం పొంచి ఉందనీ, వాటిని రక్షించాల్సిన అవసరాన్ని ఈ యాత్ర
గుర్తుచేస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగాధిపతి ఆచార్య రాజు
పేర్కొన్నారు.
గిరిజనుల మూలికావైద్యం, సంగీతం, సాహిత్యం, నాట్యం,
విలువిద్య,కొండలూ చెట్లూ ఎక్కడం వంటి విద్యలను సమాజానికి
నేర్పాలని శక్తి సంస్థ నిర్వాహకులు పి శివరామకృష్ణ అన్నారు. గిరిజనులు ప్రకృతి
ఆరాధకులని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడి జీవ వైవిధ్యాన్ని కాపాడారని గుర్తుచేసారు.
ఒడిషాలోని నందపురం, జేపూర్లను పాలించిన గిరిజన రాజులు ఆంధ్ర
విశ్వవిద్యాలయం స్థాపనలో, విశాఖ అభివృద్ధిలో కీలకపాత్ర వహించారని… ఆ విషయాలను
కూడా యాత్ర ప్రజలకు వివరిస్తుందని చెప్పారు.
జనవరి 25 సాయంత్రం జేపూర్లో ప్రారంభమయ్యే ఈ యాత్ర కోరాపుట్, పెద్దబయలు,అరకు లోయ, హుకుంపేట, పాడేరు మినుములూరు,వంట్లమామిడి కోనం,ఎస్ కోట, విజయనగరం, అనందపురం, సింహాచలం మీదుగా ఫిబ్రవరి
4న విశాఖ చేరుకుంటుంది. ఆ రోజు సాయంత్రం ఆంధ్రా
విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాలులో ముగింపు సభ
కేంద్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి అర్జున్ ముండా హాజరవుతారు.