దేశం
పయనించే దిశను యువశక్తే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో
ప్రతీ ఓటు విలువైనదన్న ప్రధాని మోదీ, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించే
బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. యువతరం వేసే ఓటే, దేశ దిశను నిర్ణయించబోతుందన్నారు.
జాతీయ
ఓటర్ల దినోత్సవం సందర్భంగా ‘నవ్ మత్తత సమ్మేళన్’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ప్రభుత్వ
విధానం, దిశను ఓటర్లే నిర్ణయిస్తారన్నారు. ప్రజాస్వామ్య
ప్రక్రియలో కొత్త ఓటర్లు కీలకంగా మారారని చెప్పిన మోదీ, రానున్న 25 ఏళ్ళలో భారత్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయించాల్సి
ఉందన్నారు.
గతంలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేదని గుర్తు
చేసిన ప్రధాని మోదీ, నేడు భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా
మారిందన్నారు. రాబోయే కాలంలో మన దేశం, ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో
ఒకటిగా నిలవబోతుందని ఆకాంక్షించారు.
కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటే క్షిష్ట సమస్యలకు
సైతం పరిష్కారం దొరుకుతుందన్న మోదీ, తమ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
తమకు సరిపడినంత బలం ఉండటంతోనే జమ్ము-కశ్మీర్ విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోగల్గామన్నారు.
త్రిపుల్ తలాక్, మహిళా బిల్లు వంటి ఎన్నో సమస్యలకు దారి చూపగల్గామని వివరించారు.
కుటుంబ రాజకీయాలు, బంధుప్రీతి కారణంగా యువత రాజకీయ
ఎదుగుదలను కొన్ని పార్టీలు అడ్డుకున్నాయని ఆరోపించారు. యువత అంతా ఓటు హక్కుతో
వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. డిజిటల్ భారత్, స్టార్టప్
నినాదంతో యువతకు అవకాశాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రధాని
మోదీ అన్నారు.