ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య తరవాత కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు దిగజారిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య కుట్ర వెనుక భారత్ హస్తముందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు (bharat canada row) ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలను దెబ్బతీశాయి. తాజాగా కెనడా మరో దూకుడు నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఎన్నికలను చైనా ప్రభావితం చేస్తోందంటూ, దానిపై విచారణకు ఆదేశించారు. అలాంటి దేశాల జాబితాలో భారత్ పేరు చేర్చడం వివాదానికి దారితీసింది.
తమ దేశ ఎన్నికల్లో విదేశాల జోక్యంపై విచారించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. అందులో భారత్ పేరు కూడా చేర్చారు. 2019, 2021 ఎన్నికల్లో భారత్ జోక్యం ఆరోపణలపై సమాచారం అందించాలని కమిషన్ వివిధ విభాగాలను అడిగింది. చైనా, భారత్, రష్యాలపై కెనడా ఇలాంటి ఆరోపణలు చేసింది. కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది.
తాజాగా ఏర్పాటు చేసిన కమిషన్ మే 3నాటికి మధ్యంతర నివేదిక, ఏడాది చివరినాటికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుందని తెలుస్తోంది. గత సంవత్సరం జూన్లో నిజ్జర్ హత్య తరవాత కెనడా ప్రధాని చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయి. ఆ తరవాత కూడా కెనడా తన తీరు మార్చుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.