Karnataka Govt asks temple priest to pay back excess salary paid for ten years
ఈ దేశంలో అందరికీ లోకువ ఎవరంటే హిందువులే. అందునా
అర్చకులంటే మరీ చులకన. ఆ పూజారి పనిచేసేది రామాలయంలో అయితే, అక్కడ అధికారంలో
ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమైతే, ఆ అర్చకుడి గతి ఇంక చెప్పనే అక్కర్లేదు. కర్ణాటకలో
సిద్దరామయ్య నేతృత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓ అర్చకుణ్ణి తనకు
చెల్లించిన వేతనాన్ని వెనక్కిచ్చేయాలంటూ ఆదేశించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక చిక్కమగళూరు జిల్లా హీరేమగళూరు
కోదండరామచంద్రస్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు కన్నన్. 2013 నుంచి 2022 వరకూ పదేళ్ళ కాలంలో
ఆయనకు ఎక్కువ జీతం చెల్లించామనీ, ఆ అదనపు మొత్తాన్ని ఇప్పుడు వెనక్కి ఇచ్చేయాలని
ఆదేశిస్తూ కర్ణాటక ప్రభుత్వం నోటీసులు పంపించింది. ఆ ఆదేశాలు డిసెంబర్ 2న జారీ
అయ్యాయి. ఐతే ఈ విషయం తాజాగా మంగళవారం నాడు వెలుగు చూసింది.
ఆ నోటీసుల ప్రకారం… ప్రభుత్వం కన్నన్కు 2013
నుంచి 2022 పదేళ్ళ వ్యవధిలో గౌరవ వేతనంగా రూ. 3.36 లక్షలు చెల్లించాల్సి ఉండగా
పొరపాటున రూ. 8.1 లక్షలు చెల్లించివేసింది. కాబట్టి అదనంగా చెల్లించిన రూ. 4.74
లక్షలను వెనక్కు ఇచ్చివేయాలంటూ స్థానిక తహసీల్దార్ ఆదేశించారు.
ఆ పదేళ్ళ వ్యవధిలో ఆ గుడి నుంచి రూ. 9.34 లక్షల
ఆదాయం వచ్చిందని, కానీ వ్యయం మాత్రం రూ. 12.96 లక్షల వ్యయం అయిందనీ ఆ నోటీసులో వెల్లడించారు.
పూజారికి ఇచ్చే వేతనాన్ని కూడా ఆ ఖర్చులో చూపించారు. ఆ ఆలయం అల్పాదాయ ధార్మిక
ప్రదేశం అంటే ‘సి’ కేటగిరీ ఆలయం అని కూడా ప్రస్తావించారు.
కన్నన్ మీడియాతో మాట్లాడుతూ ‘‘గుడి ఆదాయం తక్కువ
ఉంది కాబట్టి నాకు చెల్లిస్తున్న గౌరవ వేతనాన్ని వెనక్కు ఇచ్చేయమని అడిగారు. 2013
నుంచి 2017 వరకూ నాకు ఏడాదికి రూ. 24వేల గౌరవ వేతనం ఇవ్వాలి కానీ రూ.90వేలు చెల్లించారట.
అలాగే 2017 నుంచి 2022 వరకూ ఏడాదికి రూ.45వేల గౌరవ వేతనం ఇవ్వాలి కానీ రూ.90 వేలు
చెల్లించారట. అలా గత పదేళ్ళలో నాకు రూ. 4.74 లక్షలు ఎక్కువగా చెల్లించారట. గుడికి
ఆదాయం సరిగ్గా రావడం లేదు కాబట్టి ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ ఆదేశించారు. అయితే
ఒక సంగతి చెప్పాలి… నాలాంటి అర్చకుల వల్లనే ప్రభుత్వానికి హుండీ ఆదాయాలు
పెరుగుతున్నాయి’’ అని చెప్పారు.
ఈ విషయంపై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర ‘హిందువుల మతపరమైన మనోభావాలను కాంగ్రెస్
ప్రభుత్వం లక్ష్యం చేసుకుని మరీ దెబ్బతీస్తోందం’టూ సోషల్ మీడియాలో విమర్శించారు.
ఈ విషయం చినికి చినికి గాలివాన అవడంతో కర్ణాటక
రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. అర్చకుడికి
పంపిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించాలని ఆదేశించారు, ‘‘ఈ తప్పుడు చెల్లింపులకు, అదనపు
మొత్తాల వసూలుకు బాధ్యులైన తహసీల్దార్, ఇతర ఉన్నతాధికారులపై ఇంక్వైరీ
జరపాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాను’’ అని ఆయన చెప్పారు.
ఆ తప్పుడు చెల్లింపులకు స్థానిక తహసీల్దారే కారణం
కాబట్టి ఆ మొత్తాన్ని తహసీల్దార్ నుంచి వసూలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య
బుధవారం మీడియాకు వెల్లడించారు. అయితే ఆ
చెల్లింపులకు బాధ్యులైన ప్రభుత్వ అధికారుల్లో కొందరు ఇప్పటికే రిటైర్ అయిపోయినట్లు
సమాచారం.
నిజానికి అర్చకులకు
చెల్లించిన అదనపు మొత్తాలను వెనక్కి తీసుకునే కార్యక్రమం 2022 మార్చినుంచే మొదలైంది.
అప్పటినుంచీ పూజారులకు గౌరవ వేతనాలు చెల్లించడం నిలిపివేసారు.