అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు
భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం నాడు సుమారు 5 లక్షల మంది స్వామిని
దర్శించుకోగా, బుధవారం నాడు మూడు లక్షల మంది మూల విరాట్ ను దర్శించారు. భక్తుల
సంఖ్య ఎక్కువగా ఉండటంతో దర్శన వేళలు పొడిగిస్తూ రామ తీర్థ్ ట్రస్టు నిర్ణయం
తీసుకుంది. సాయంత్రం 7 గంటల వరకు ఉన్న దర్శన సమయాన్ని రాత్రి 10 గంటల వరకు
పొడిగించారు.
ఆలయ ట్రస్ట్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
ఎన్ని చర్యలు తీసుకున్నా అయోధ్యలో పెరుగుతున్న భక్తుల రద్దీ అందరినీ ఆశ్చర్యానికి
గురిచేస్తోంది. ఇప్పటికే అయోధ్యకు బస్సు సర్వీసులు నిలిపివేయడంతో పాటు ప్రధాన రహదారుల్లో
రాకపోకలపై ఆంక్షలు విధించారు. అదనపు భద్రతా బలగాలు మోహరించి అవాంఛనీయ సంఘటనలు
జరగకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు.
అయోధ్యలో రద్దీ దృష్ట్యా కేంద్రమంత్రులు, దర్శనానికి వెళ్లొద్దని
ప్రధాని మోదీ సూచించారు. ప్రోటోకాల్స్ దృష్ట్యా సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగుతున్న
నేపథ్యంలో ఈ మేరకు సూచన చేశారు. మార్చిలో బాల రాముడిని దర్శించుకోవాలని మంత్రులకు
సూచించారు.
దేశంలోని 2,500 ప్రాంతాల నుంచి
సేకరించిన మట్టిన ఆలయ పునాదిలో వాడామని అలాగే 155 దేశాల నుంచి అందిన పవిత్ర జలాలతో
మూలవిరాట్టుకు అభిషేకం చేసినట్లు తెలిపారు. ప్రాణప్రతిష్ఠ వేళ మంగళధ్వని కోసం ఆంధ్రప్రదేశ్లోని ఘటంతోపాటు దేశంలోని వివిధ
ప్రాంతాల్లోని ప్రఖ్యాత సంగీత పరికరాలను ఉపయోగించినట్లు వివరించారు.
రానున్న రోజుల్లో పర్యాటకరంగంలో
ఉత్తరప్రదేశ్ అగ్రగామిగా మారుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధనా విభాగం
అంచనా వేసింది. అయోధ్యను ఈ ఏడాది సందర్శించే యాత్రికుల ఖర్చు రూ. 4 లక్షల కోట్ల
మార్క్ దాటుతుందని లెక్కలు వేసింది.