The other two idols of Ram Lalla
అయోధ్యలో నూతనంగా నిర్మితమవుతున్న భవ్య
రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా జరిగింది. కర్ణాటక
మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఆలయ గర్భగృహంలో
ప్రతిష్ఠించారు. ఐతే, ఈ కార్యక్రమం కోసం మొత్తం మూడు శిల్పాలను తయారు చేయించారు.
మిగతా రెండూ ఎలా ఉన్నాయి? వాటి వివరాలేంటి?
రెండో విగ్రహాన్ని రాజస్థాన్‌కు చెందిన
సత్యనారాయణ్ పాండే రూపొందించారు. ఆ విగ్రహాన్ని తెల్లటి పాలరాతితో తయారుచేసారు.
రాముడు ధరించిన ఆభరణాలను, దుస్తులను సైతం పాలరాతితో చెక్కారు. ప్రధానమూర్తి వెనుక పాలరాతి
మీద విష్ణుమూర్తి దశావతారాలనూ తీర్చిదిద్దారు.
మూడో విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన గణేష్ భట్ అనే
శిల్పి రూపొందించారు. దాన్ని కూడా, మొదటి శిల్పంలానే నల్లరాతితోనే చెక్కారు. ఆ
కృష్ణశిలను మైసూరు సమీపంలోని హెగడదేవనకోటె అనే ప్రదేశంలోని ఒక పొలం నుంచి సేకరించారు.
ఈ విగ్రహం వెనుకనున్న తోరణాన్ని పుష్పలతలు, దేవతా ప్రతిమలతో మలిచారు.
మొదటి రెండు మూర్తులకూ ధనుర్బాణాలు విడిగా
పెట్టేలా ఏర్పాటు చేస్తే, మూడో విగ్రహానికి వాటిని కూడా శిల్పంలో భాగంగానే
చెక్కారు. మూడు మూర్తుల్లోనూ కొట్టొచ్చినట్టు కనిపించే మరో లక్షణం మందస్మితం. చిరు
దరహాసంతో బాలరాముడు భక్తులను కటాక్షించడం విశేషం. మూడు మూర్తులూ జీవకళ
ఉట్టిపడుతుండడం కళాకారుల పనితనానికి నిదర్శనం.
అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరామచంద్రమూర్తి
గర్భగృహంలో కొలువుతీరాడు. మిగతా రెండు విగ్రహాలను సైతం అదే ఆలయంలో వేరేచోట్ల
అమరుస్తామని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు ఇప్పటికే
ప్రకటించారు.