వైసీపీ
లేవనెత్తిన ‘‘వై నాట్ 175’’ నినాదం వెనుక దొంగ ఓట్ల కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురందరేశ్వరి అన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై బీజేపీ ఫిర్యాదు చేయడంతోనే
విచారణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. బీజేపీ పోరాటం కారణంగానే
అక్రమాలకు పాల్పడిన ఓ అధికారిపై చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.
విజయవాడలో
ఛలో అభియాన్ వర్క్ షాపును ప్రారంభించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన
పురందరేశ్వరి, కేంద్రప్రభుత్వ పథకాలు , రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తోన్న
సహకారాన్ని సోషల్ మీడియా ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
తిరుపతి
ఉప ఎన్నికలోనే 35 వేల దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు.
అధికారపార్టీ అభ్యర్థుల స్థానాలు మారుస్తూ
వారి మద్దతుదారుల ఓట్లు కూడా మార్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఓటు మార్చుకునే
అవకాశాన్ని వైసీపీ దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని మరోమారు
కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి బీజేపీ తీసుకెళుతోందన్నారు.
రాష్ట్ర
ప్రజలను వైసీపీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించిన
పురందరేశ్వరి, బీజేపీ కార్యకర్తలు ప్రజలకు
వాస్తవాలు వివరించాలన్నారు.
పొత్తులతో
సంబంధం లేకుండా పార్టీని బలోపేతం చేసుందుకు శ్రమించాలని కోరారు. ప్రజల దగ్గరకి వెళ్లడానికి సంకోచించాల్సిన
అవసరం లేదన్నారు. కేంద్ర సహకారం లేకుండా
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం ఒక్కటీ లేదన్నారు.
కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్,
రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా
శివన్నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయ్యాజీ వేమ, బాల కృష్ణ పాల్గొన్నారు.