కర్నూలు,
మచిలీపట్నం ఎంపీలు ఇప్పటికే వైసీపీకి అధికారికంగా రాజీనామా చేయగా వారి బాటలోనే
నరసరావు పేట ఎంపీ కూడా నడిచారు. ఇక ఇప్పటికే రెబెల్ ఎంపీగా ముద్రపడిన
రఘురామకృష్ణంరాజు ఈ సారి టీడీపీ-జనసేన కూటమిలో భాగంగా తన సిట్టింగ్ స్థానం నుంచి
పోటీ ఖాయమైంది. ఇక ఒంగోలు ఎంపీ కూడా ఊగిసలాటలో ఉన్నారు. వైసీపీకి ఇవాళో రేపో టాటా
చెప్పేయడం ఖాయమనేలా పరిణామాలు ఉన్నాయి.
‘‘వై
నాట్ 175’’ అంటున్న వైసీపీ అధినేత జగన్ ఎన్నికల నినాదానికి ఆ పార్టీ వాస్తవ
పరిస్థితికి ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం
వహించే కుప్పం అసెంబ్లీ స్థానాన్ని కూడా తామే కైవసం చేసుకుంటామని ఇప్పటవరకు ఢంకా బజాయించిన
వైసీపీ నేతలు ఒక్కసారిగా చేతులెత్తేశారు. కుప్పం సంగతి పక్కన పెడితే పీసీసీ చీఫ్
షర్మిల రూపంలో పులివెందులకే ఎసరు వచ్చేలా ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో సెటైర్లు
పేలుతున్నాయి.
కోరుకున్న
స్థానానికి టికెట్ ఇవ్వలేదని కొందరు, అసలు పోటీ చేసే అవకాశమే రావడం లేదని
మరికొందరు, వైసీపీ అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తూ ఇంకొందరు ఆ పార్టీని
వీడుతున్నారు.
ఇదే
అదనుగా ఈ సారి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తే ఎన్నికల ఖర్చు మినహా మిగిలేది ఏమీ
ఉండదంటూ ప్రత్యర్థులు గేలి చేస్తున్నారు. వైసీపీలో ముదిరిన ముసలాన్ని తమకు అనువుగా
మలచుకునేందుకు కాచుకు కూర్చున్నారు.
అధికారపార్టీకి
గుడ్ బై చెబుతున్న నేతల్లో లోక్‌సభ సభ్యులు, శాసనసభ్యుల నుంచి క్షేత్ర స్థాయి
కార్యకర్తలు కూడా ఉండటమే అందుకు కారణం. వైసీపీ కోర్ కమిటీ పై ఆగ్రహం వ్యక్తం
చేస్తోన్న అసంతృప్త నేతల్లో మెజారిటీ నేతలు సీఎం సొంత సామాజికవర్గం కావడం కూడా ఆ పార్టీని
మరింత కలవరపెడుతోంది.
వైఎస్
కుటుంబానికి విధేయులుగా పేరున్న వారు కూడా వైసీపీకి దూరం కావడం ఆ పార్టీ
విజయావకాశాలను మరింత దెబ్బతీసే అవకాశముంది.
నరసరావు
పేట ఎంపీ సీటును బీసీలకు ఇచ్చే ఉద్దేశంతో కృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీ
చేయమని వైసీపీ హైకమాండ్ కోరింది. దానికి ఆయన నిరాకరించి పార్టీకి రాజీనామా చేశారు.
ఇక మచిలీపట్నం ఎంపీ టికెట్ విషయంలో కూడా ఇదే తరహా డ్రామా నడిచింది. టీడీపీ-జనసేన
కూటమి ప్రభావం ఎక్కుగా ఉండే నియోజకవర్గం కావడంతో అక్కడ కూడా సిట్టింగ్ ఎంపీ
బాలశౌరికి టికెట్ హామీ దక్కలేదు. దీంతో ఆయన జనసేన అధినేతతో సమావేశమయ్యారు.
కర్నూలు
ఎంపీ టికెట్ దక్కక పోవడంతో సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా
చేశారు.
టికెట్ ఖాయమైన గుమ్మనూరు జయరాం కూడా ఫ్యాన్ గుర్తుపై పోటీకి
తటపటాయిస్తున్నారు. కర్నూలు ఎంపీకి బదులు ఆలూరు నుంచి హస్తం గుర్తుపై పోటీ
చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమలాపురం
ఎంపీ టికెట్ కూడా ఇంకా ఖరారు చేయలేదు.
ప్రతిపక్షాల
పొత్తులు, ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో అభ్యర్థుల మార్పునకు వైసీపీ ప్రాధాన్యమిస్తోంది.
దాదాపు 68 స్థానాల్లో రాజకీయ బదిలీలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. 29 మందికి
సీటు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు
వైసీపీకి రాజీనామా చేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు
కూడా వైసీపీ హైకమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరో దారి చూసుకునేందుకు
సిద్ధమయ్యారు.