ఊహించినట్లే
ఇండీ కూటమి మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుంది. విపక్ష కూటమిలో కీలక భాగస్వామిగా
ఉన్న టీఎంసీ, లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా పోటీకి సిద్ధమైంది.
ఇండీ
కూటమి లో భాగస్వామిగా ఉన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్నికల పొత్తులపై
తాజాగా కీలక ప్రకటన చేశారు.
లోక్ సభ
ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. సీట్ల సర్దుబాటుపై
కాంగ్రెస్ తో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని స్పష్టం చేసిన మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్
లో బీజేపీని ఒంటరిగా ఎదుర్కొంటామన్నారు. బీజేపీని ఓడించే సత్తా తమకు మాత్రమే
ఉందన్నారు. ఫలితాల అనంతరం పొత్తుపై నిర్ణయం ఉంటుందన్నారు.
తమ ప్రతిపాదనలను
కాంగ్రెస్ ఆది నుంచి వ్యతిరేకిస్తోందని అందుకే తమ దారి తాము చూసుకున్నామని మమతా
వివరణ ఇచ్చారు.
విపక్షాల
పొత్తు ఏ ఒక్క పార్టీపై ఆధారపడి లేదన్న మమతా, బీజేపీని ఓడించేందుకు ఏం చేయాలో అది
చేస్తామన్నారు.
కాంగ్రెస్
అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రపై కూడా తమకు సమాచారం లేదన్న
మమతా బెనర్జీ ఆ యాత్రతో తమకు సంబంధం లేదన్నారు. ఇదేనా మిత్రపక్షానికి ఇచ్చే గౌరవం
అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. రాహల్ యాత్ర పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించనుంది.
మమతా
బెనర్జీ అవకాశవాది నేత అంటూ కాంగ్రస్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. బెంగాల్ లో తమకు రెండు సీట్లు మాత్రమే ఇస్తామని టీఎంసీ
ఆఫర్ చేసిందని, సీట్ల కోసం కాంగ్రెస్ వెంపర్లాడదని ఆయన వ్యాఖ్యానించారు.
తాజాగా
జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇండీ కూటమి పార్టీల మధ్య
పొరపొచ్చాలు బయటపడ్డాయి.
మధ్యప్రదేశ్
ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేకుండానే సమాజ్‌వాదీ పోటీ చేసింది. పంజాబ్ లో ఆప్ కూడా
కాంగ్రెస్ తో మైత్రికి విముఖత చూపుతోంది. దీంతో పేరుకు కూటమిలో ఉంటూనే ఎవరి
రాజకీయం వారు చేస్తున్నారు.