Six aartis for Balak Ram, new set of clothes everyday
ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత అయోధ్య రామయ్యను
పిలిచే తీరు మారింది. కొత్తగా నిర్మిస్తున్న మందిరాన్ని ‘బాలక్ రామ్’ మందిరం అని
వ్యవహరిస్తున్నారు. ఇక ప్రాణప్రతిష్ఠ తర్వాత పూజాదికాల తీరులో కొంత స్పష్టత
వచ్చింది.
ఇకపై బాలరాముడికి రోజుకు ఆరుసార్లు హారతి
ఇస్తారు. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు చెందిన మిథిలేశ్ నందినీ శరణ్
ఆచార్యజీ చెప్పిన వివరాల ప్రకారం ప్రతీరోజూ ఆరుసార్లు హరతులుంటాయి. మేలుకొలుపు
సమయంలో మంగళ హారతి, అలంకరణ చేసేటప్పడు శృంగార హారతి, నైవేద్యం సమర్పించేటప్పుడు
భోగహారతి, స్వామికి దిష్టి తగలకుండా ఉత్పన్నహారతి, సాయంత్రం సమయంలో సంధ్యా హారతి,
నిద్రపుచ్చడానికి శయన హారతి ఇస్తారు.
బాల రామయ్యకు ఏరోజు ఏ దుస్తులు తొడగాలో కూడా
నిర్ణయించారు. ఆదివారం గులాబీరంగు దుస్తులు, సోమవారం తెల్లని దుస్తులు, మంగళవారం
ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపుపచ్చ, శుక్రవారం గోధుమరంగు, శనివారం
నీలివర్ణపు దుస్తులతో రామయ్యను అలంకరిస్తారు. ఈ దుస్తులకు ఢిల్లీకి చెందిన డిజైనర్
రూపకల్పన చేసారు.
ఇంక స్వామికి అలంకరించే ఆభరణాలను విశేషంగా
తయారుచేయించారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ వంటి గ్రంథాలను అధ్యయనం
చేసి స్వామికి ఆభరణాలు తయారుచేయించారు. లఖ్‌నవూ నగరానికి చెందిన వ్యాపారులు ఆ
ఆభరణాలను తయారుచేసారు.
బాలరాముడికి నైవేద్యంగా రబ్డీ-ఖీర్, పాలు, పళ్ళతో
చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెడతారు. స్వామిని దర్శించుకోడానికి వచ్చే భక్తులకు
అన్నప్రసాదం కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.