As many as Three Lakh devotees had darsan of Balak Ram on Day One
అయోధ్యలో ప్రతిష్ఠితుడైన రామ్‌లల్లాను ‘బాలక్‌రామ్’గా
వ్యవహరించాలని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం
ప్రాణప్రతిష్ఠ తర్వాత మంగళవారం నుంచీ భక్తుల దర్శనాలకు అనుమతించారు. దాంతో
మొదటిరోజే మూడులక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళా అదే జోరు
కొనసాగుతోంది.
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సోమవారం కేవలం
వీఐపీలు, ప్రత్యేక అతిథులు మాత్రమే దర్శించుకున్నారు. సమస్త జనులకూ మంగళవారం నుంచి
దర్శనానికి అనుమతించారు. దాంతో మంగళవారం స్వామి కోసం 5లక్షల మంది అయోధ్యలో
పోటెత్తారు. వారిలో సుమారు 3లక్షల మందికి మాత్రమే దర్శనభాగ్యం కలిగింది.
ఇవాళ కూడా తెల్లవారేసరికి ఆలయ ప్రాంగణం వద్ద భక్తజనసముద్రం
ఆవిష్కృతమైంది. సాధారణంగా రోజుకు లక్ష మంది వరకూ భక్తులు ‘బాలక్ రామ్’ను
దర్శించుకుంటారని అంచనా వేసారు. మంగళవారం నాడు జనసందోహానికి తగినట్లుగా క్యూ
ఏర్పాట్లు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగింది. దాంతో స్వయంగా ముఖ్యమంత్రి యోగి
ఆదిత్యనాథ్ మళ్ళీ అయోధ్యకు వచ్చి ఏరియల్ సర్వే చేపట్టారు. తర్వాత పరిస్థితులను
సమీక్షించి అధికారులకు తగిన సూచనలిచ్చారు.
అయోధ్య వచ్చిన భక్తులను వ్యవస్థీకృతంగా దర్శనాలకు
పంపడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్
ప్రసాద్, పోలీస్ విభాగంలో శాంతిభద్రతల డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్‌లను అక్కడ
మోహరించింది. ‘‘ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అందుకే ప్రభుత్వం మా ఇద్దరినీ
ఇక్కడికి పంపించింది. జన సందోహానికి అసౌకర్యం కలగకుండా క్యూ పద్ధతిని మెరుగుపరిచాము’’
అని ప్రశాంత్ కుమార్ చెప్పారు.
ఆలయం దగ్గర సుమారు 8వేల మంది భద్రతా సిబ్బందిని
మోహరించారు. ఉత్తరప్రదేశ్ పోలీస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సశస్త్ర సీమా బల్
దళాలు కట్టుదిట్టంగా పహరా కాస్తున్నాయి. ఆలయం దగ్గర వేర్వేరు ప్రదేశాల్లో 8మంది
మేజిస్ట్రేట్లు కూడా విధులు నిర్వహిస్తున్నారు.
రామయ్య దర్శనానికి తొందర
పడవద్దనీ, ఒకట్రెండు వారాల్లో రావాలనీ ప్రజలకు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ సూచించారు.
‘‘ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కానీ జనప్రవాహం ఆగడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు ఒక
రెండు వారాలు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దర్శనానికి
తొందర ఏమీ లేదు. ఆలయం అందరికోసం తెరిచే ఉంటుంది. భక్తులు కొంచెం నిదానిస్తే మరింత
మెరుగైన ఏర్పాట్లకు అవకాశం ఉంటుంది’’ అని వివరించారు.