Do you know how ancient the stone used to make the idol of Ram Lalla is?
అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరంలో
ప్రాణప్రతిష్ఠ చేసిన బాలరాముడి విగ్రహాన్ని చూసి భావోద్వేగానికి గురికాని
భారతీయులే లేరంటే అతిశయోక్తి కాదు. 51 అంగుళాల ఆ విగ్రహాన్ని కర్ణాటక మైసూరుకు
చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఆ మూర్తిని తయారు చేయడానికి కావలసిన
రాతిని కూడా కర్ణాటక నుంచే సేకరించారు.
ఐదేళ్ళ వయసు కలిగిన బాలరాముడి మూర్తిని తయారు
చేయడానికి వినియోగించిన బ్లాక్ గ్రానైట్ రాయి ఎంతో ప్రాచీనమైనది. ఆ రాయి వయసు 250
కోట్ల సంవత్సరాలట. ఆ విషయాన్ని బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్
మెకానిక్స్ డైరెక్టర్ హెచ్ ఎస్ వెంకటేష్ ధ్రువీకరించి వెల్లడించారు.
బాలరాముడి మూర్తిని తయారుచేయడానికి అనువైన శిలను నిర్ధారించడానికి
పెద్ద ప్రయత్నమే జరిగింది. ఎన్నెన్నో రాళ్ళను పరీక్షించి, ఆ శిలలకు ఫిజికో
మెకానికల్ అనాలసిస్ చేసి, చివరిగా ఇప్పుడు మనం చూస్తున్న మూర్తిని తయారుచేసిన
శిలను ఖరారు చేసారు. ఈ పని చేసిన ఎన్ఐఆర్ఎం, భారతదేశంలో డ్యామ్‌లు, అణుశక్తి కేంద్రాల
నిర్మాణానికి రాళ్ళను పరీక్షించే ప్రతిష్ఠాత్మక సంస్థ.
‘‘ఆ శిల సుదీర్ఘకాలం మన్నుతుంది. వాతావరణ
మార్పులను తట్టుకోగలదు. భారతదేశపు వాతావరణంలో అతితక్కువ నిర్వహణతో వేల సంవత్సరాల
పాటు మనగలదు’’ అని డాక్టర్ వెంకటేష్ వివరించారు.
భూమి ఏర్పడే క్రమంలో వెలువడిన లావా కొన్ని లక్షల
యేళ్ళు చల్లబడినప్పుడు గ్రానైట్ రాళ్ళు ఏర్పడ్డాయి. ఆ గ్రానైట్ అత్యంత దృఢమైన
పదార్ధం. ప్రస్తుతం రామమూర్తిని తయారుచేయడానికి వినియోగించిన గ్రానైట్‌ను కర్ణాటక
మైసూరు జిల్లాలోని జయపుర హొబ్లి గ్రామం నుంచి సేకరించారు. మంచి నాణ్యత కలిగిన గ్రానైట్
గనులకు ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.
మనం నివసిస్తున్న ఈ భూమి పుట్టి సుమారు 450 కోట్ల
సంవత్సరాలు అయి ఉంటుంది. భూగర్భంలో లావా చల్లబడడం ద్వారా గ్రానైట్ తయారైన కాలాన్ని
‘ప్రీ-కాంబ్రన్ ఎరా’ అంటారు, అంటే అది కనీసం 4వందల కోట్ల సంవత్సరాల క్రితం
తయారయింది. ఇక రామచంద్రమూర్తి విగ్రహాన్ని తయారుచేయడానికి ఉపయోగించిన శిల సుమారు
250 కోట్ల సంవత్సరాల పురాతనమైనది, అంటే అది భూమి వయసులో సగం వయసున్న శిల అన్నమాట.
ఎన్ఐఆర్ఎమ్ సంస్థ ఆ శిలను కర్ణాటకలోని కోలార్
గోల్డ్ ఫీల్డ్స్‌లో ఉన్న తమ ప్రయోగశాలలో పరీక్షించింది. 51 అంగుళాల బాలరాముడి
మూర్తిని తీర్చిదిద్దడానికి ఒక పెద్ద శిలాఖండాన్ని ఎంచుకున్నారు. ‘‘అది భారీగా
ఉంది, చిక్కటి నల్లని రంగులో ఉంది, రాయి మొత్తం ఒకేరంగులో ఉంది. ఆ రాయి దృఢంగా
ఉంది, తగినంత ఒత్తిడిని తట్టుకోగల సామర్థ్యం ఉంది, శిల్పం చెక్కే ప్రక్రియలో
ఏవిధంగానైనా ఉపయోగించడానికి వీలుగా ఉంది. ఇంకా ఆ శిల సాంద్రత చాలా ఎక్కువగా ఉంది.
నీటిని పీల్చుకునే గుణం అతితక్కువగా ఉంది, ఆ రాయి లోపల ఎలాంటి పగుళ్ళూ లేవు. ఆ రాయి
కార్బన్‌తో ఎలాంటి చర్యా పొందదు’’ అని డాక్టర్ వెంకటేష్ వివరించారు.
అయోధ్యలోని భవ్య రామమందిరాన్ని ప్రాచీన భారతీయ
సంప్రదాయిక శైలిలో, అత్యుత్తమ నాణ్యత కలిగిన రాళ్ళతో నిర్మిస్తున్నారు. అయితే ఆ
మందిరం సుదీర్ఘకాలం మనగలిగేలా దాని నిర్మాణంలో ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని
వినియోగిస్తున్నారని కేంద్ర శాస్త్రసాంకేతిక వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్
చెప్పారు. ఆలయాన్ని కనీసం వెయ్యేళ్ళపాటు మన్నేలా డిజైన్ చేసారని ఆయన వివరించారు.