ABVP Record Attempt: World’s largest 3D Rangoli
అయోధ్యలో నూతనంగా నిర్మితమవుతున్న రామమందిరంతో
కూడిన శ్రీరామచంద్రమూర్తి చిత్రాన్ని త్రీడీ ముగ్గుగా గీసి రికార్డు సృష్టించారు
విద్యార్ధులు. అఖల భారతీయ విద్యార్ధి పరిషత్‌కు చెందిన రాష్ట్రీయ కళామంచ్ కళాకారులు
ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు.
ప్రయాగరాజ్‌లోని మాఘమేళా ప్రాంతంలో
విశ్వహిందూపరిషత్ శిబిరం జరుగుతోంది. పరిషత్ అనుబంధ సంస్థ అయిన రాష్ట్రీయ కళామంచ్
కళాకారులు కూడా ఆ శిబిరంలో పాల్గొంటున్నారు. అయోధ్యలో నూతన మందిరంలో
రామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ సందర్భాన్ని పురస్కరించుకుని రామయ్యకు నివాళి
అర్పించదలిచారు. దాంతో 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఈ కళాఖండాన్ని
రూపొందించారు. దీనికోసం 321 కేజీల సహజ రంగులను వినియోగించారు.
ఈ ముగ్గు వేసిన వారు మొత్తం 40మంది
విద్యార్ధులు. వారంతా అలహాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన వారు. వారిలో 16మంది ముగ్గుకు
ఏర్పాట్లు చేయగా, 24మంది ముగ్గు వేసారు. జనవరి 19న ఈ కళాఖండాన్ని రూపొందించారు.
మొత్తం ముగ్గు పూర్తిచేయడానికి వారికి 14గంటల సమయం పట్టిందని ఏబీవీపీ ఉత్తరప్రదేశ్
రాష్ట్ర సహకార్యదర్శి ఆంచల్ సింగ్ వెల్లడించారు. ఈ త్రీడీ ముగ్గును ప్రజలు
పెద్దసంఖ్యలో చూస్తున్నారని ఏబీవీపీ ప్రయాగ మహానగర్ కార్యదర్శి సచిన్ సింగ్ రాజ్‌కుమార్
తెలిపారు.
ఈ త్రీడీ ముగ్గు ప్రపంచంలోనే
అతిపెద్దది అని ఏబీవీపీ చెబుతోంది. ఈ ముగ్గు వేసే మొత్తం ప్రక్రియను వీడియోద్వారా
చిత్రీకరించారు. దాన్ని పరిశీలన కోసం పంపించారు. ఒకసారి పరిశీలన పూర్తయితే ఈ
ముగ్గు ఈ వారంలోనే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కుతుంది.