BJP slams YSRCP accusing of creating fake votes
దేశమంతా రామమయం ఐతే ఆంధ్రప్రదేశ్ అంతా
దొంగలమయం ఐపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ మండిపడ్డారు. దొంగ ఓట్లు,
కరెన్సీ నోట్లతో ఎన్నికల్లో గెలవాలని అధికార
పార్టీ పన్నాగాలు పన్నుతోందని ఆరోపించారు. నకిలీ ఓటరు కార్డులపై రాష్ట్రమంతటా దర్యాప్తు
జరగాలని డిమాండ్ చేసారు.
విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో
మీడియా సమావేశంలో మాట్లాడిన భానుప్రకాష్, అధికారులను సస్పెండ్ చేసి చేతులు
దులుపుకుంటే సరిపోదనీ, ఆ అక్రమాల వెనుక ఉన్న పెద్దలను కూడా శిక్షించాలనీ డిమాండ్
చేసారు. దర్యాప్తు నిజాయితీగా జరిగితే అధికార పార్టీ నేతలు డిస్క్వాలిఫై అవుతారని
స్పష్టం చేసారు.
ఒక్క తిరుపతి నగరంలోనే 34వేలకుపైగా ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసారనీ, ఆ విషయమై కేంద్ర
ఎన్నికల సంఘానికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఫిర్యాదు చేసారనీ భానుప్రకాష్ గుర్తు
చేసారు. దానిపై విచారణకు ఆదేశాలు జారీచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే, ఆ కేసును
పోలీసులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు అధికారులు
ఇంకా ఎంతకాలం అధికారపార్టీకి వంత పాడతారని ఆగ్రహించారు. ఆ విషయంపై తిరుపతి ఎస్పీకి
ఫిర్యాదు చేసి,నిష్పక్షపాతంగా
విచారించాలని కోరామని చెప్పారు.
ఎపిక్ కార్డుల విషయంలో అధికార పార్టీ
నేతల పాత్ర ఉందని భానుప్రకాష్ ఆరోపించారు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని వైసీపీ
కుట్ర చేసిందన్నారు. ఆ కేసుల నుంచి వైసీపీ నాయకులను తప్పించేందుకు ఐపీఎస్
అధికారులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎలక్షన్ల
పేరుతో సెలక్షన్లు చేశారని ఆరోపించారు.
ఒక్క తిరుపతిలోనే 34వేల దొంగ ఓట్లు ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని దొంగఓట్లు ఉంటాయోనని
భానుప్రకాష్ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ విషయంలో న్యాయం జరిగేవరకూ బీజేపీ
పోరాడుతుందన్నారు.